శ్రీశైలంలో తెలంగాణ విద్యుత్పత్తినీ ఆపండి—కృష్ణ బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ

శ్రీశైలంలో తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపండి
కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ


అమరావతి *(అభి మీడియా సొల్యూషన్స్: శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)ను కోరింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి. నారాయణరెడ్డి గురువారం కేఆర్‌ఎంబీ సభ్య కార్యదర్శికి లేఖ రాశారు. నీటి విడుదల ఆదేశాలను కేఆర్‌ఎంబీ జారీచేయకపోయినప్పటకీ ఈ నెల 1వ తేదీ నుంచే తెలంగాణ జెన్‌కో ఏకపక్షంగా శ్రీశైలం ఎడమ హైడ్రో ఎలక్ట్రిక్‌ స్టేషన్‌ నుంచి విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తోందని ఆ లేఖలో నారాయణరెడ్డి పేర్కొన్నారు. కనీస డ్రాయింగ్‌ లెవల్‌ 834 అడుగులు అయితే.. అంతకన్నా తక్కువ 808.40 అడుగులు నుంచే తెలంగాణ జెన్‌కో ఈ నెల 1 నుంచే విద్యుదుత్పత్తికి నీటిని వినియోగిస్తోందని ఆ లేఖలో వివరించారు.ఇప్పటివరకు 8.89 టీఎంసీలు శ్రీశైలం జలాశయంలోకి రాగా.. అందులో 3 టీఎంసీలు అంటే 34 శాతం నీటిని తెలంగాణ జెన్‌కో విద్యుత్‌ ఉత్పత్తికి వాడేసిందని వివరించారు. నీటి అవసరం లేకున్నప్పటికీ తెలంగాణ జెన్‌కో ఇలా నీటిని వినియోగించడంవల్ల జలాశయంలో నీటి మట్టం అడుగంటిపోతోందని, జలాశయం నీటి మట్టం పెరగడానికి చాలా సమయం పడుతుందని ఆ లేఖలో నారాయణరెడ్డి పేర్కొన్నారు. దీనివల్లపోతిరెడ్డిపాడు, చెన్నైకు తాగునీరు, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కెనాల్, జీఎన్‌ఎస్‌ఎస్‌కు నీటి సరఫరాకు తీవ్ర జాప్యం జరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. జలాశయంలో కనీసం 854 అడుగులు ఉంటేనే ఏడు వేల క్యూసెక్కులు డ్రా చేయగలమని ఆయన పేర్కొన్నారు.
కేఆర్‌ఎంబీ ఆదేశాలకు విరుద్ధంగా : వరద సమయంలో తప్ప మిగతా సమయంలో కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు ఆదేశాల మేరకే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ సాగునీటి, విద్యుత్‌ అవసరాలకు నీటిని వినియోగించాల్సి ఉందని, అయితే అందుకు విరుద్ధంగా తెలంగాణ జెన్‌కో శ్రీశైలం జలాశయం నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి నీటిని వినియోగిస్తోందని నారాయణరెడ్డి ఆరోపించారు. కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ ఆదేశాలు లేకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఆపరేషన్‌ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ జెన్‌కో ఏకపక్షంగా చేస్తున్న విద్యుదుత్పత్తిని తక్షణం నిలుపుదల చేయాలని కోరారు.