శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవం గురువారం తిరుమలలో ఘనంగా ముగిసింది. సాయంత్రం 4.30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు పల్లకీపై ఊరేగింపుగా బయల్దేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు.

ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర క‌ల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. వెంటనే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాలను పారాయణం చేశారు. కళాకారులు మంగ‌ళ‌క‌రంగా సంగీత‌, మేళ‌, తాళ వాయిద్యాలను ప్ర‌ద‌ర్శించారు. ఇందులో శ్రీనివాస గద్యంతో పాటు హారికాoభోజీ , నళినకాంతి, కానడా, యమునా కల్యాణి,
శ్రీరాగం, మలహరి, నీలంబారి రాగాలను పలికించారు. అర్చ‌కులు శ్రీ రామ‌కృష్ణ దీక్షితులు ఆధ్వ‌ర్యంలో ఈ మూడు రోజుల ప‌రిణ‌యోత్స‌వాలు జ‌రిగాయి. ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ జి.మ‌ధుసూద‌న‌రావు బృందం ర‌స‌ర‌మ్యంగా అన్నమాచార్య కీర్తనలు ఆల‌పించారు. హార‌తి అనంత‌రం స్వామి దేవేరులతో కలిసి ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ఉత్సవాల కారణంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా అష్ట‌ల‌క్ష్మీ ద‌శావ‌తార మండ‌పం

ఈ మూడు రోజుల ప‌ద్మావ‌తి ప‌రిణ‌యోత్స‌వాల్లో పుణెకి చెందిన శ్రీ వేంక‌టేశ్వ‌ర ఛారిట‌బుల్ ట్ర‌స్టు ఆధ్వ‌ర్యంలో ఏర్పాటుచేసిన అష్ట‌ల‌క్ష్మీ ద‌శావ‌తార మండ‌పం సెట్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. నాలుగు ట‌న్నుల ఫ‌లాలు, 30 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్ల‌తో క‌లిపి మూడు ట‌న్నుల పుష్పాలను మండ‌పం అలంక‌ర‌ణ‌కు వినియోగించారు.

ఈ కార్యకమంలో టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ న‌రసింహ కిషోర్‌, ఎస్ఇ-2 శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబు, అన్న‌ప్ర‌సాదం మ‌రియు దాత‌ల విభాగం డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ప‌ద్మావ‌తి, అన్న‌మాచార్య ప్రాజెక్టు డైరెక్ట‌ర్ డా. ఆకెళ్ల విభీష‌ణ‌శ‌ర్మ‌, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, విజివో శ్రీ బాలిరెడ్డి ఇత‌ర అధికారులు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.