జులై నుంచి ఆర్మీలో అగ్నివీరుల రిక్రూట్మెంట్
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ఇయ్యాల నేవీ.. 24న ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్లు
ఆందోళన వద్దు.. మేం ఉద్యోగాలిస్తం..
అగ్నిపథ్ ఆందోళనకారులకు ఇండస్ట్రియలిస్టుల హామీ
న్యూఢిల్లీ: అగ్నిపథ్ మిలిటరీ రిక్రూట్మెంట్ స్కీమ్ కింద జవాన్ల నియామకానికి సంబంధించి ఆర్మీ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ కింద అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి రిక్రూట్మెంట్ వెబ్సైట్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని ఆర్మీ ప్రకటించింది. జులై నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఎయిర్‌ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తేదీలను ప్రకటించింది. మంగళవారం నేవీ నోటిఫికేషన్.. ఈ నెల 24న ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం జూన్ 14న అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద 17.5 సంవత్సరాల నుంచి 21 ఏండ్ల మధ్య వయస్సు గల యువకులను నాలుగు సంవత్సరాల కాలానికి మాత్రమే రిక్రూట్ చేసుకుంటారు. వీరిలో 25 శాతం మందిని మరో 15 సంవత్సరాల పాటు కొనసాగించే నిబంధన ఉంది. అయితే 2022లో రిక్రూట్మెంట్ కోసం వయో పరిమితిని కేంద్రం 23 ఏండ్లకు పొడిగించింది. కాగా, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో నిరసనలు వెల్లువెత్తాయి.
నోటిఫికేషన్లో
ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్స్ను ప్రత్యేకమైన ర్యాంక్‌గా చూస్తారు. ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్‌ల కంటే భిన్నంగా ఉంటుంది.
అగ్నివీర్‌గా పనిచేసిన కాలంలో తెలుసుకున్న రహస్య సమాచారాన్ని అనధికార వ్యక్తులు లేదా సంస్థలకు వెల్లడించకుండా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్–1923 ప్రకారం నిషేధం విధించారు.
ఈ స్కీమ్‌ను అమలులోకి తీసుకురావడంతో మెడికల్ బ్రాంచ్‌లోని టెక్నికల్ కేడర్లు మినహా ఆర్మీలోకి రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో అగ్నివీర్లుగా నాలుగేండ్లు పూర్తి చేసుకున్న వారికే అవకాశం దక్కుతుంది.
నాలుగేండ్లు పూర్తి కావడానికి ముందు సొంత అభ్యర్థనపై అగ్నివీర్‌ను విడుదల చేసే అవకాశం లేదు. అయితే, కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఈ పథకం కింద నమోదు చేసుకున్న సిబ్బందిని విడుదల చేసేందుకు సంబంధిత శాఖ అనుమతిస్తే విడుదల చేయవచ్చు.
అగ్నిపథ్ పథకం కింద కొత్త రిక్రూట్మెంట్లు ఆర్మీ యాక్ట్–1950 నిబంధనలకు లోబడి ఉంటుంది. వీరు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఎక్కడైనా పనిచేయాల్సి ఉంటుంది.
అగ్నివీరులు తమ సర్వీస్‌లో యూనిఫాంపై విలక్షణమైన చిహ్నాన్ని ధరిస్తారు.
ఆర్మీ అవసరాలు, విధానాల ఆధారంగా ప్రతి బ్యాచ్‌లో నాలుగేండ్లు పూర్తయిన తర్వాత అగ్నివీర్లకు రెగ్యులర్ కేడర్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
నాలుగేండ్ల పనితీరుతో పాటు వివిధ ప్రమాణాల ఆధారంగా సెంట్రలైజ్డ్ పద్ధతిలో ఈ దరఖాస్తులను ఆర్మీ పరిగణనలోకి తీసుకుంటుంది. ప్రతి బ్యాచ్ అగ్నివీర్లలో 25% నాలుగేండ్లు పూర్తయ్యాక రెగ్యులర్ కేడర్‌లోకి ఎంపికవుతారు.
రెగ్యులర్ కేడర్‌గా ఎంపికైన అగ్నివీర్లు తదుపరి 15 సంవత్సరాల పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న సర్వీస్ నియమాలు (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్/ ఇతర ర్యాంక్‌ల), షరతులు వారికి వర్తిస్తాయి.
నాలుగేండ్లు పూర్తయిన తర్వాత అగ్నివీర్లకు ఎంపిక చేసుకునే హక్కు ఉండదు.
ఎన్రోల్మెంట్ ప్రక్రియలో భాగంగా, ప్రతి అగ్నివీర్.. అగ్నిపథ్ పథకంలోని అన్ని నిబంధనలు, షరతులకు అంగీకారం తెలపాలి. 18 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వారి ఎన్రోల్మెంట్ ఫామ్‌పై తల్లిదండ్రులు లేదా సంరక్షకులు సంతకం చేయాల్సి ఉంటుంది.
రెగ్యులర్ సర్వీస్‌లో ఉన్న వారికి ఏడాదికి 90 రోజుల సెలవులు ఉంటే.. అగ్నివీర్లకు ఏడాదికి 30 రోజుల సెలవులు ఉంటాయి. మెడికల్ ఎడ్వయిజ్ ఆధారంగా మెడికల్ లీవ్
మంజూరు చేస్తారు.
అగ్నివీరుల నెల జీతంలో 30 శాతం తప్పనిసరిగా కార్పస్‌లో జమ చేస్తారు. అంతే మొత్తాన్ని ప్రభుత్వం అందులో జమ చేస్తుంది.
ఆందోళన వద్దు.. మేం ఉద్యోగాలిస్తం..
అగ్నిపథ్ స్కీమ్‌కు మద్దతుగా ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు ముందుకొచ్చారు. అగ్నివీర్ కు ఉద్యోగాలు ఇచ్చేందుకు తాము సిద్ధమని మహింద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహింద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్‌గోయెంకా, బయోకాన్ లిమిటెడ్ చైర్పర్సన్ కిరణ్ మజూందార్షా ప్రకటిం చారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు కార్పొరేట్ సెక్టార్లో చాలా అవకాశాలు ఉన్నాయని వారు చెప్పారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మకం గా మారడంపై ఆనంద్ మహింద్రా ఆందోళన వ్యక్తంచేశారు. ఫార్మ్ ఎక్విప్మెంట్ నుంచి ఎయిరో స్పేస్ వరకు శిక్షణ పొందిన వారికి చాలా అవకాశాలు ఉన్నాయని చెప్పారు.