వారసత్వ’ రేసులో రామప్ప*
యునెస్కో గుర్తింపునకు రామలింగేశ్వరాలయం
గుజరాత్‌లోని హరప్పా సైట్ ధోలవీర కూడా..
నామినేట్ చేసిన కేంద్రం
16 నుంచి చైనాలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ భేటీ
రామప్ప, ధోలవీరపై చర్చించనున్న నిపుణులు
ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేరే అవకాశం
మనసుపెట్టి వినాలేగాని ఆ రాళ్లు రాగాలు పలుకుతాయి. నాట్యగత్తెల అందెల సవ్వడులు మదిలోచేరి గిలిగింతలు పెడుతాయి. ప్రతి శిల్పం అపురూప సౌందర్యంతో అలరారుతుంది. ఆ రాతిలోని అందాలను చూడలేని కనులు కనులే కావు అన్నంతగా కట్టిపడేస్తాయి. ‘ఆ నల్లని రాళ్లలో ఏ కన్నులు దాగెనో’ అన్న కవి వర్ణనకు అక్షరాలా అద్దంపడుతుంది రామప్ప ఆలయం. అణువణువునా అపురూప శిల్పసౌందర్యం ఉట్టిపడే ఆ అద్భుత కోవెల ఇప్పుడు ప్రపంచ యవనికపై రెపరెపలాడే అవకాశం ఉన్నది.
తెలంగాణ గడ్డపై అద్భుత శిల్ప సంపదకు నెలవైన చారిత్రక రామప్ప ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చే అవకాశం చేరువైంది. ఈ అద్భుత ఆలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. ఈ ఆలయానికి ప్రపంచ వారసత్వ హోదా సాధించాలని రాష్ట్రప్రభుత్వం ఎంతోకాలంగా కృషిచేస్తున్న విషయం తెలిసిందే. గత నెల 23న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, శ్రీనివాస్‌గౌడ్ అధ్వర్యంలో ఎంపీలు, ఉన్నతాధికారులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్ పాటిల్‌ను కలిసి రామప్పకు ప్రపంచవారసత్వ హోదా వచ్చేలా కృషిచేయాలని కోరారు. దాంతో కేంద్ర ప్రభుత్వం రుద్రేశ్వర (రామప్ప) దేవాలయంతోపాటు గుజరాత్‌లోని సింధు నాగరికత నాటి పట్టణమైన ధోలవీరను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు నామినేట్ చేసింది. చైనాలో ఈ నెల 16 నుంచి 31వరకు వరల్డ్ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశాలు జరుగనున్నాయి. ఇందులో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన 255 ప్రతిపాదనలను పరిశీలించనున్నారు. ఈ సమావేశాల్లోనే రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వరల్డ్ హెరిటేజ్ కమిటీ 167 దేశాలకు చెందిన 1,121 కట్టడాలు, ప్రదేశాలను ఇప్పటివరకు ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో చేర్చగా, భారత్ నుంచి 38 వారసత్వ ఆస్తులకు స్థానం దక్కింది. యునెస్కో అనుబంధ సంస్థ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐకోమాస్) ప్రతినిధి వాసుపోశానందన 2019లో రామప్పను పరిశీలించి వెళ్లారు. ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేరేందుకు ఈ ఆలయానికి అన్ని అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
800 ఏండ్ల సజీవ చరిత్ర..
కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సేనాపతిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు క్రీస్తుశకం 1213లో రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఈ గొప్ప కట్టడం ఉన్నది. రామప్ప ఆలయం నిర్మాణం కోసం వినియోగించిన రాయి అరుదైన లేత ఎరుపు వర్ణంలో ఉంటుంది. దాంతో ఆలయం వందల ఏండ్లుగా చెక్కుచెదరకుండా అదే రంగులో ఉన్నది. రామప్ప నిర్మాణశైలి భిన్నమైనది. సాధారణంగా నిర్మాణంలో వినియోగించే ఇటుకల సాంద్రత 2.2 ఉంటుంది. అవి నీటిలో మునిగిపోతాయి. వీటికి మూడు రెట్లు తక్కువ బరువు ఉండే (0.8 సాంద్రత) ఇటుకలను రామప్ప ఆలయ నిర్మాణంలో వినియోగించారు. ఇవి నీటిలో తేలుతాయి. ఇలాంటి ఇటుకలను దేశంలో ఎక్కడా వినియోగించలేదని చరిత్రకారులు చెప్తున్నారు. వందల ఏండ్లుగా ఈ ఆలయ నిర్మాణం చెక్కుచెదరకపోవడానికి అప్పుడు అనుసరించిన నిర్మాణశైలి ప్రధాన కారణమని పరిశోధకులు అంటున్నారు. పునాదిలో ఇసుక నింపే ప్రక్రియ (శాండ్ బాక్స్ టెక్నాలజీ)తో రామప్ప ఆలయాన్ని నిర్మించారు. మూడు మీటర్ల లోతు పునాది తవ్వి, అందులో పూర్తిగా ఇసుకను నింపి ఈ ఆలయాన్ని నిర్మించారు. 12 అంగుళాల పొడవు ఉండే బీమ్‌లను ఉపయోగించారు. భూకంపాలు వచ్చినా కుంగిపోకుండా ఈ టెక్నాలజీని వాడారు. కట్టడం బరువు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో తేలికగా ఉండే గ్రానైట్, డోలమైట్, బ్లాక్ గ్రానైట్‌లను వినియోగించారు. డోలమైట్ రాయిపై చెక్కిన శిల్పాలు రామప్ప ఆలయానికి ప్రత్యేక శోభను తెచ్చాయి. ఆ శిల్పాలు నునుపుగా కనిపిస్తాయి