ఏటీయంలలో నగదు లేకపోతే బ్యాంకుకు జరిమానా

ఏటీఎంలలో నగదు లేకపోతే ఆ బ్యాంకులకు 10 వేల రూపాయల జరిమానా (ఫైన్) : రిజర్వ్‌ బ్యాంకు.*

అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన

ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం వల్ల ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆ atm లో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి తాజా నిబంధన అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఏటీఎంలు ఖాళీ అయిన వెంటనే బ్యాంకులు తిరిగి డబ్బు నింపకపోవడం వల్ల ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి తమ దృష్టికి వచ్చినట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ నేపథ్యంలో వాటిలో నోట్ల లభ్యతను పర్యవేక్షించే వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిందిగా బ్యాంకులు, వైట్‌ లేబుల్‌ ఏటీఎం (డబ్ల్యూఎల్‌ఏ) ఆపరేటర్లను ఆదేశించినట్లు పేర్కొంది. డబ్ల్యూఎల్‌ఏల్లో నగదు అందుబాటులో లేకపోతే.. వాటికి డబ్బు అందజేసే బాధ్యతను కలిగి ఉన్న బ్యాంకులకు జరిమానా విధిస్తామని తెలిపింది.