ఆంధ్రాశబరిమలైలో 14న మకర జ్యోతి దర్శనం

  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ ధర్మకర్త

శంఖవరం, జనవరి 2 (విశ్వం వాయిస్ న్యూస్);

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం పెదమల్లాపురం పంచాయతీ శివారు సిద్ధివారిపాలెంలోని ఆంధ్రాశబరిమలైగా ప్రసిద్ది పొందిన మణికంఠుడి ఆలయం పరిసరాల్లో 14 వ తారీఖు సంక్రాంతి రోజున సకల భక్త జన నయన మనోహరంగా మకర జ్యోతి దర్శనం లభించనుంది. ఈ ఆలయం ప్రాంగణంలో మకర జ్యోతి దర్శనానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎత్తైన తూర్పు కనుమల పర్వత శ్రేణి ప్రాంతాల్లో మకర జ్యోతి దర్శనం లభిస్తుంది.
రాష్ట్రంలోని, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి మాల ధారణ చేసిన భక్తులు, దర్శనం చూడాలనుకునే ఔత్సాహిక భక్తులూ స్వామికి ప్రతి రూపమైన మకర జ్యోతి దర్శనానికి భక్త జనం నలు మూలల నుంచి ఈ ఆంధ్రా శబరిమల దారి పడతారు. స్వామి వారి మండల పూజులు పూర్తి చేసుకున్న భక్త స్వాములు అయ్యప్ప దర్శనం కోసం ఎదురు చూస్తుంటారు. సాధారణంగా అయ్యప్ప మకర జ్యోతి ఎప్పుడూ మకర సంక్రాంతి రోజునే ప్రత్యక్షం అవుతుంది. మకర సంక్రాంతి ఎప్పుడు వస్తుందనే విషయంలో ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క విధంగా గంటల వ్యవధిలో నిర్ణయిస్తారు. ఎక్కువ సార్లు జనవరి 14న మకర సంక్రాంతి వస్తుంది. ఈ పర్యాయం కూడా జనవరి 14న ఉదయం 8.30 గంటల నుంచి ఉదయం 10.22 గంటల వరకూ మకర సంక్రాంతి మహా పుణ్య కాలం ఉంది. అంటే మొత్తం 1గంట 52 నిమిషాలు ఉంటుంది. ఈ సమయంలో చేసే పనులు అత్యంత ఎక్కువ సత్ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ పర్వదినాన ఈ ఆంధ్రా శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర జ్యోతి దర్శనానికి అత్యంత కన్నుల పండుగగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయం సమీపంలో తూర్పు దిక్కున ఉన్న తూర్పు కనుమలలో సాయంత్రం 6.40 గంటల తర్వాత ఇక్కడ అయ్యప్ప స్వామి మకర జ్యోతి రూపంలో దర్శనమిస్తారు. ఈ దర్శనమిచ్చే ఆధ్యాత్మిక ఘట్టాన్ని తిలకించేందుకు అయ్యప్ప మాలలు ధరించిన స్వాములు ఈ ఆంధ్రా శబరిమలకు పెద్ద ఎత్తున చేరుకుంటారు. స్వామియే శరణం అయ్యప్ప అంటూ ఆ స్వామి నామ స్మరణతో శబరిగిరులు మార్మోగుతూ ఉంటాయి. ఆ దృశ్యం చూడటానికి రెండు కన్నులూ చాలవనిపి స్తుంది. మకర జ్యోతి రూపంలో దర్శనం ఇచ్చే మణికంఠుడిని చూసి తరించడానికి రెండు రోజుల నుంచి భక్తులు ఇక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకుంటారు.

వీరి సౌకర్యం కోసం శంఖవరం నుంచి సిద్ధివారిపాలెం వరకూ 12 కిలోమీటర్ల దూరం పొడవునా ఉచిత రవాణా సౌకర్యంగా ప్రత్యేకంగా వాహనాలను ఆలయ ధర్మకర్త, భూపతి, గౌరవ డాక్టరేట్ గ్రహీత, గురుస్వామి
కుసుమంచి శ్రీసత్యశ్రీనివాసరావు ఏర్పాటు చేసారు. ఈ వాహనాల్లో భక్తుల దాహార్తిని తీర్చేందుకు తాగు నీటిని కూడా అందుబాటులో ఉంచుతారు. ఆలయానికి చేరుకున్న భక్తులకు ఉచిత ప్రసాద వితరణతోపాటు ఉదయం పులిహోర, ఉప్మా వంటి ఉపాహారం, మధ్యాహ్నం సాత్వికాహారం అందించే సహపంక్తి అన్న ప్రసాద సమారాధన సౌలభ్యం ఇక్కడ భక్తులకు ఉచితంగా లభిస్తాయి. మకరజ్యోతి దర్శనం చేసు కోవడాన్ని వేయి జన్మల పుణ్య ఫలంగా భక్తులు భావిస్తారు. భక్తుల మనో భావాలకు తగినట్లుగా ఏ లోటుపాట్లు లేకుండా స్వామిని దిగ్విజయంగా దర్శించు కునేందుకు తన వ్యవస్థాపక కార్య నిర్వహణా సారధ్యంలోని ఆంధ్రా శబరిమలలో ఈ ఏడాది కూడా మునుపటి మాదిరిగా అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త, భూపతి కుసుమంచి శ్రీసత్య శ్రీనివాసరావు “విశ్వం వాయిస్ న్యూస్” కు ఆదివారం వారం తెలిపారు.