జర్నలిస్టులను వేదించే జాబితాలోకి భారత ప్రధాని నరేంద్రమోడి.

జర్నలిస్టులను వేదించే జాబితాలోకి భారత ప్రధాని నరేంద్రమోడి…………..

రిపోర్టర్స్‌ శాన్స్‌ ఫ్రాంటియర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌)అనే అంతర్జాతీయ విలేకరుల సంస్థ పత్రికా స్వేచ్ఛకు సంబంధించి వివిధ దేశాధినేతల ఫొటోలను గ్యాలరీ రూపంలో ఇటీవల ప్రచురించింది. ‘పత్రికా స్వేచ్ఛను వేటాడేవాళ్లు’ అని ఈ గ్యాలరీకి పేరు పెట్టింది. ఇందులో మొత్తం 37 దేశాధినేతల ఫొటోలను ప్రచురించిన ఆర్‌ఎస్‌ఎఫ్‌..ఈ నేతల కారణంగా పత్రికా స్వేచ్ఛ అణచివేతకు గురవుతోందని ఆరోపించింది. ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌, పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటూ ఇద్దరు మహిళా నేతలను కూడా ఈ గ్యాలరీలో చేర్చింది. మొత్తం 17 మంది నేతలకు తొలిసారిగా ఈ జాబితాలో చోటుదక్కగా.. ప్రధాని మోదీ చిత్రాన్ని కూడా ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఈ గ్యాలరీలో చేర్చింది. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, హాంకాంగ్‌ అడ్మినిస్ట్రేటర్‌ క్యారీ లామ్‌ను పత్రికా స్వేచ్ఛను వేటాడేవాళ్లుగా ఆర్‌ఎస్‌ఎఫ్‌ అభివర్ణించింది. 2018లో షేక్‌ హసీనా అమల్లోకి తెచ్చిన కొత్త డిజిటల్‌ చట్టం కారణంగా ఏకంగా 70 మంది జర్నలిస్టులు కేసులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. చైనా చేతిలో కీలుబమ్మగా మారిన క్యారీ కూడా కమ్యునిస్టు పార్టీ అణచివేత ధోరణులకు వంత పాడుతోందట. ఆమె చర్యల కారణంగా హాంకాంగ్‌లో యాపిల్స్‌ డెయిలీ అనే దినపత్రిక మూతపడిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. అంతేకాకుండా.. ఆ దినపత్రిక వ్యవస్థాపకుడు కూడా జైలు పాలయ్యాడని తెలిపింది. ఈ గ్యాలరీలో తొలిసారిగా చోటు సంపాదించిన వారిలో హంగరీ ప్రధానమంత్రి విక్టోర్‌ ఆర్బాన్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సనారో ఉన్నారు. బోల్సనారో మీడియాపై దూషణభూషణలతో విరుచుకుపడుతున్నారని, కరోనా సంక్షోభం సమయంలో ఆయన దూకుడు కొత్త పుంతలు తొక్కిందని ఆర్‌ఎస్‌ఎఫ్‌ మండిపడింది. సౌదీ అరేబీయా పాలకుడు, యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌పై కూడా ఆర్‌ఎస్‌ఎఫ్‌ పలు ఆరోపణలు చేసింది. బెదిరించడం, చిత్రహింసలు పెట్టడం, అపహరించడం, విలేకరులపై చాటుగా నిఘా పెట్టడం వంటి చర్యలకు యువరాజు పాల్పడ్డాడని పేర్కొంది. సౌదీ జర్నలిస్టు జమాల్‌ ఖషోగ్గీ హత్య కారణంగా యువరాజును ఈ గ్యాలరీలో చేర్చామని చెప్పింది. ఇక భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీపై కూడా ఆర్‌ఎస్‌ఎఫ్‌ తన అభిప్రాయాలను పంచుకుంది. నేషనల్‌ పాపులిజమ్‌, తప్పుడు సమాచారం మోదీ విధానాలని పేర్కొంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ ఆ రాష్ట్రాన్ని వార్తలు, సమాచార నియంత్రణకు ఓ ప్రయోగశాలగా మార్చారని అభిప్రాయపడింది. తన భావాజాలం న్యాయమైనదిగా చూపించేందుకు మోదీ తన ప్రసంగాలను ప్రధాన మీడియాలో పోటెత్తేలా చేస్తూ తప్పుదారి పట్టించే ప్రచారానికి దిగుతున్నారని ఆరోపించింది. మోదీ ప్రధాన ఆయుధం ఇదే అని కూడా వ్యాఖ్యానించింది. మోదీ వద్ద న్యాయపరమైన అస్త్రాలు కూడా ఉన్నాయని ఇవి పత్రికాస్వేచ్ఛకు ప్రమాదకరంగా మారుతున్నాయని పేర్కొంది. రాజద్రోహం చట్టం కారణంగా భారత్‌లో విలేకరులు జీవిత ఖైదు శిక్ష పడే ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంటున్నారని పేర్కొంది.