అర్హులందరికి ఆసరా పింఛన్లు ఇవ్వండి
సీఎం కేసీఆర్కు సంజయ్ లేఖ
హైదరాబాద్: ఆసరా పెన్షన్ల వయోపరిమితిని 57 ఏళ్లకు తగ్గిస్తున్నట్లు ఇచ్చిన హామీ అమలు ఏమైందని సీఎం కేసీఆర్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పెన్షన్ల కోసం దాదాపు 11 లక్షల మంది అర్హులు ఎదురు చూస్తున్నారన్నారు. 2018లో టీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీ అమలై ఉంటే ఒక్కో ఆసరా పింఛన్ లబ్ధిదారుడికి ఇప్పటిదాకా రూ.78,624 లబ్ధి కలిగి ఉండేదని గురువారం సీఎంకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటనలే తప్ప కసరత్తు లేకపోవడం శోచనీయమన్నారు. అర్హులందరికీ కొత్త పింఛన్లు ఇవ్వాలని, దరఖాస్తుల స్వీకరణకు మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక కుటుంబానికి ఒకే ఆసరా పెన్షన్ మంజూరు చేస్తామని ప్రకటించడం అన్యాయమన్నారు. ఆసరా పింఛన్ అందుకుంటున్న వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబంలోనే అర్హులుంటే దాని కొనసాగింపు లేదా మరొక లబ్ధిదారునికి ఇవ్వడం నిరంతరం సాగాలన్నారు.