
అమలాపురం టౌన్(కోనసీమ జిల్లా) : ఆ ముగ్గురూ పలు చోరీ కేసుల్లో నిందితులు. జైలులో శిక్ష అనుభవించిన సమయంలో వారి మధ్య స్నేహం కుదిరింది. చోరీల ద్వారా కాజేసిన బంగారు నగలు, వెండి వస్తువులతో ఎప్పటికైనా కర్ణాటక రాష్ట్రంలో ఓ జ్యూయలరీ షాపు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అనుకున్నదే తడవుగా జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత వరుస చోరీలకు పాల్పడ్డారు. మొత్తం 25 చోరీల్లో దోచుకున్న సొత్తుతో కారులో కర్ణాటకకు బయలుదేరారు.
ఈ క్రమంలో రామచంద్రపురం డివిజన్ పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి రూ.కోటి సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురినీ అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. అమలాపురంలోని తన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా ఎస్పీ కేఎఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి, మండపేట సీఐ పి.శివగణేష్ ఈ దొంగల ముఠా చోరీల చిట్టాను వివరించారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును విలేకర్లకు చూపించారు. వీరు దోచుకున్న బంగారు నగలు, వెండి వస్తువులు, బంగారం కరిగించే పరికరాలు జ్యూయలరీ షాపును తలపించింది.