ఏపీ అంతటా చంద్రబాబు సాధన దీక్ష ప్రారంభం

చంద్ర బాబు ‘సాధన దీక్ష’ ప్రారంభం
కొవిడ్‌ బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్‌తో ఏపీ వ్యాప్తంగా తెదేపా ‘సాధన దీక్ష’ ప్రారంభమైంది. అమరావతిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు కూర్చొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గ కేంద్రాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు దీక్ష ప్రారంభించారు. ‘సాధన దీక్ష’ ప్రారంభానికి ముందు ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేసి నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ దీక్ష కొనసాగనుంది. కరోనా పరిస్థితుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి మంది ఉపాధి కోల్పోయారని తెదేపా పేర్కొంది. తెల్లరేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.10వేల తక్షణ సాయం అందించాలని, కరోనా పరిస్థితులు కొనసాగినంతకాలం ఆయా కుటుంబాలకు రూ.7,500 ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్‌ చేసింది. కొవిడ్‌తో మరణించిన ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం అందించాలని, ఆక్సిజన్‌ కొరతతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25లక్షలు చెల్లించాలనే డిమాండ్లతో తెదేపా ‘సాధన దీక్ష’ చేపట్టింది..