శిరివెళ్ల: భాజపాతో తమ పార్టీ అనుబంధం చాలా అద్భుతంగా ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం గోవిందపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై పవన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
భాజపాతో మీ రిలేషన్ ఎలా ఉంది?
పవన్: అద్భుతంగా ఉంది.
జనసేనకు భాజపా నేతలు రోడ్ మ్యాప్ ఇచ్చారా? లేదా?
పవన్: ఏడుకోట్ల మంది ప్రజల సమస్య. చాలా ఆలోచించి కచ్చితంగా తీసుకుంటాం. రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన విషయాలు, వ్యూహాలు వెంటవెంటనే ఎందుకు చెప్తాం. సరైన సమయంలో పరిస్థితులను బట్టి చెప్తాం.
భాజపా అధ్యక్షుడు రోడ్ మ్యాప్ ఇచ్చినట్లు చెప్పారు కదా?
పవన్:అన్నారా.. మీరు చెప్పింది ఒకసారి పరిశీలించి చెప్తాను.
భాజపాతో కలిసి పనిచేస్తున్నామని చెబుతూ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కదా?
పవన్: పోరాటం ఒంటరిగా ఎక్కడ చేస్తున్నాం? ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది.. కచ్చితంగా చేస్తాం.
పొత్తులపై తెదేపా మిమ్మల్ని ఆహ్వానిస్తే మాట్లాడతారా? లేదా?
పవన్: రాష్ట్ర భవిష్యత్తు, ప్రజల క్షేమం, అభివృద్ధి కోసం బలమైన ఆలోచనా విధానంతో ముందుకెళ్తాం.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటున్నారు కదా.. అలా జరగకుండా ఎలా ముందుకెళ్తారు?
పవన్: ఏదో ఒక అద్భుతం జరుగుతుందని భావిస్తున్నా.