19 వేల పోలీస్ కొలువులు!
భారీ నోటిఫికేషన్‌కు రంగం సిద్ధం
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించే అవకాశం…
హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ రాబోతోంది. 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదివారం వాటి భర్తీ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ప్రకటన చేయనున్నట్లు సమాచారం. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో పోలీస్ కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్ కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో తొలిసారి ఇచ్చారు. 2018లో మరోసారి పెద్ద ఎత్తున పోస్టులు ప్రకటించారు. ఆ సమయంలో 1,217 మంది ఎస్సైలు, 16,925 మంది కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. పలు కారణాలతో వీటిలో దాదాపు 3 వేల వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలిపోయాయి. కొంతకాలం క్రితం మరో నోటిఫికేషన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. 33శాతం మహిళలకు కేటాయించనున్నారు. ఈసారి ఎస్సై స్థాయిలో 360(సివిల్), 29(ఏఆర్), 20(కమ్యూనికేషన్స్) పోస్టులుంటున్నట్లు సమాచారం.
19 వేల పోలీస్ కొలువులు