హీరో కార్తి, అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’. సర్దార్ లో రాశి ఖన్నా , రజిషా విజయన్ కథానాయికలు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలౌతుంది. కింగ్ అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. ఈ నేపధ్యంలో హీరో కార్తి విలేఖరుల సమావేశంలో ‘సర్దార్’ విశేషాలని పంచుకున్నారు.
పొన్నియిన్ సెల్వన్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు.. కొంచెం గ్యాప్ లోనే సర్దార్ తో వస్తున్నారు.. ఎలా అనిపిస్తుంది ?
పొన్నియిన్ సెల్వన్ సమ్మర్ కి రావాలి. కొంచెం ఆలస్యంగా వచ్చినా గొప్ప విజయాన్ని అందుకుంది. పొన్నియిన్ సెల్వన్ తర్వాత ఒక ససినిమా తీసుకురావాలంటే ఖచ్చితంగా కొత్తగా స్పెషల్ గా వుండాలి. అలా ఇండియన్ స్పై థ్రిల్లర్ గా సర్దార్ వస్తోంది. ఇందులో మొదటిసారి తండ్రి కొడుకుల పాత్రలో కనిపిస్తున్నా. కథ ప్రకారం చాలా గెటప్స్ వుంటాయి. ఇప్పటివరకూ నేర్చుకున్నది ఒక పరీక్షలా వుంది.(నవ్వుతూ). ఒక గ్రామంలో పెరిగిన రంగస్థల నటుడు గూఢచారిగా మారి ఏం చేశాడనేది దర్శకుడు మిత్రన్ అద్భుతంగా చూపించారు. 1980లో జరిగే కథ, ఆ ప్రపంచాన్ని చాలా వండర్ ఫుల్ గా తీశారు. ఈ సినిమా కోసం చాలా పరిశోధన చేశారు. మిత్రన్ అభిమన్యుడులో డిజిటల్ క్రైమ్ వరల్డ్ ని చూపించారు. అది చాలా కొత్తగా షాకింగా అనిపించింది కదా. సర్దార్ లో కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు వున్నాయి. ట్రైలర్ లో ఒక ఫైల్ మిస్సింగ్ గురించి చూపించాం కదా.. అందులో మనం బ్రతకడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు వున్నాయి. సర్దార్ కథ వినకముందు దాని గురించి ఆలోచన లేదు. ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని మామూలు అలవాట్లు మార్చుకుంటారనే నమ్మకం వుంది.
సర్దార్ లో తండ్రి పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు ?
60 ఏళ్లలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయని మా నాన్న గారిని అడిగాను. అయితే ఆయనకి యోగా అలవాటు వుంది. దాని వలన ఆయన శరీరంలో ఎలాంటి మార్పులు లేవు. నాజర్ గారిని అడిగాను. మెట్లు ఎక్కడం కష్టంలో కొంచెం ఇబ్బంది, అలాగే మాట్లాడినప్పుడు నోటి నుండి ఎక్కువ గాలి వస్తుందని కొన్ని విషయాలు చెప్పారు. గెటప్ వేసుకుంటే ఓల్డ్ మ్యాన్ లా కనిపించవచ్చు. కానీ సర్దార్ యాక్షన్ కూడా చేయాలి. సర్దార్ కి పోలీస్ పాత్రలకు మధ్య స్పష్టమైన తేడా చూపించాలి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశా. ఖైదీ సినిమా చేసినప్పుడు ఒక హాలీవుడ్ సినిమాకి ధీటుగా వుండాలని తీశాం. సర్దార్ ని కూడా అలా ఒక హాలీవుడ్ మూవీలా ప్రజంట్ చేశాం. నా కెరీర్ లో ఇది సవాల్ తో కూడిన పాత్ర. కెమరామెన్ జార్జ్ కొత్త ప్రపంచం చూపించారు. 1980 వరల్డ్ ని సృస్టించారు. జీవీ ప్రకాష్ కుమార్ అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రంలో డిఫరెంట్ లేయర్స్ వుంటాయి. సర్దార్ పాత్ర సమాజం నుండి ఏమీ ఆశించదు. దేశం కోసమే పని చేస్తుంది. పోలీస్ పాత్రకి ప్రతి చిన్నదానికి పబ్లిసిటీ కావాలి. ఈ రెండు పాత్రల మధ్య చాలా వైవిధ్యం వుంటుంది.
సర్దార్ కథ యదార్ధ సంఘటనల స్ఫూర్తి ఆధారంగా ఉంటుందా ?
సర్దార్ పాత్ర రియల్ క్యారెక్టర్ స్ఫూర్తితో డిజైన్ చేశారు. ఇక్కడ పుట్టిన ఒక రంగస్థల నటుడు పాకిస్థాన్ లో జనరల్ గా పని చేశారు. దీని స్ఫూర్తిగా సర్దార్ కథని రాశారు.
సర్దార్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతాడా ?
సర్దార్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా. దిపావళికి కుటుంబం అంతా కలసి సర్దార్ ని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో లైలా పాత్రకి ఒక కొడుకు ఉంటాడు. ఆ పాత్రలో చాలా హ్యుమర్ వుంటుంది. స్పై వరల్డ్ ని నమ్మేలా చేసిన పాత్రది. సర్దార్ లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. అందరూ చూసి ఎంజాయ్ చేసేలా వుంటుంది.
సర్దార్ లాంటి సినిమాకి పాన్ ఇండియా అవకాశం వుంది కదా ?
అవును. యునీవర్సల్ అప్పీల్ వున్న సినిమా సర్దార్. ఈ సినిమాలో విలన్ గా చేసిన చుంకీ పాండే గారు మొదటి రోజు నుండి ఇది పాన్ ఇండియా సినిమా అనే చెబుతున్నారు. ఇప్పుడు హిందీలో కొన్ని సినిమాలు విడుదలకు రెడీగా వున్నాయి. ఒక వారం తర్వాత బాలీవుడ్ లో విడుదల చేయాలనే ఆలోచన వుంది.
వైవిధ్యమైన, భారీ సినిమాలు చేస్తున్నప్పుడు ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం ఉంటుందా ?
నిజానికి ప్రేక్షకులు ఇచ్చిన నమ్మకంతోనే ఇలాంటి భారీ సినిమాలు చేస్తున్నాను. కాష్మోరా, ఖాకీ, ఖైధీ, పోన్నియిన్ సెల్వన్ ఇలా అన్నీ చిత్రాలని ఆదరిస్తున్నారు. వారు ఇచ్చిన ప్రోత్సాహంతో వైవిధ్యమైన సినిమాలు చేయాలనే ఉత్సాహం వస్తోంది.
తెలుగులో నేరుగా సినిమా ఎప్పుడు చేస్తున్నారు ?
కొన్ని కథలు వింటున్నాను. నిజానికి తెలుగు నాకు వేరే పరిశ్రమ అనుకోను. ఇది నా సొంత ఇల్లు. అమ్మ ఇంటి నుండి పిన్ని ఇంటికి వచ్చినట్లే వుంటుంది. (నవ్వుతూ)
ఊపిరిలో నాగార్జున గారితో కలసి నటించారు.. సర్దార్ నాగార్జున గారు విడుదల చేస్తున్నారు .. ఎలా అనిపిస్తుంది ?
నాగార్జున అన్నయ్య వుంటే చాలా హాయిగా వుంటుంది. సినిమాకి కావాల్సిన అన్నీ ఆయనే చూసుకుంటారు. నన్ను చాలా ప్రేమిస్తారు. ట్రైలర్ చూసి చాలా ప్రామిసింగ్ గా వున్నావ్ అని మెసేజ్ పెట్టారు. ఆయన పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో వుంటాను.
కథలు పాన్ ఇండియాని దృష్టి లో పెట్టుకొని ఎన్నుకుంటున్నారు..ఈ ఒత్తిడి మీపై ఉంటుందా ?
నిజానికి పాన్ ఇండియా ప్లాన్ చేస్తే వచ్చేది కాదు. మన ప్రేక్షకులకు ఏది నచ్చుతుందో ముందు దాన్ని చూసుకోవాలి. రాజమౌళి గారు బాహుబలిని తెలుగు ప్రేక్షకుల కోసం తీశారు. అది పాన్ వరల్డ్ వెళ్ళింది. సినిమా, కాన్సెప్ట్ బావుంటే ఆటోమేటిక్ గా పాన్ ఇండియా ఆడుతుంది.
దర్శకుడు పిఎస్ మిత్రన్ లో మీకు నచ్చిన అంశాలు ?
మిత్రన్ ది మంచి వ్యక్తిత్వం వుంది. దర్శకుడిగా ఒక బలమైన విషయాన్ని సమాజానికి చెప్పాలి చూపించాలనే ఆయన తపన నాకు నచ్చింది. ఆయన ఎవరు ఐడియా ఇచ్చిన తీసుకుంటారు. ఎలాంటి ఈగో వుండదు. సినిమా మంచి కోసమే తపించే దర్శకుడు. ఆయన రీసెర్చ్ చాలా బావుంటుంది.
సర్దార్ పట్ల సూర్య గారు ఎలా స్పందించారు ?
అన్నయ్య ట్రైలర్ చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యారు. చాలా పెద్ద సినిమా, బలమైన కంటెంట్ వున్న సినిమాలా అనిపిస్తుందని చెప్పారు.
దీపావళి కి నాలుగు సినిమాలు వస్తున్నాయి ? ఎలాంటి పోటి వుంటుందని భావిస్తున్నారు. ?
గతంలో పది సినిమాలు కూడా వచ్చాయి. (నవ్వుతూ). పోటి అంటూ ఏమీ వుండదు. సినిమా బావుంటే ఖచ్చితంగా చూస్తారని నమ్ముతాను.
ఖైధీ 2 ఎప్పుడు ?
ఢిల్లీ వెళ్ళినా ఢిల్లీ గురించి అడుగుతున్నారు( నవ్వుతూ). విక్రమ్ తర్వాత దీనికి పై మరిన్ని అంచనాలు పెరిగాయి. త్వరలోనే చేస్తాం.