హరిహర వీరమల్లు” లో ‘పంచమి’ గా నిధి అగర్వాల్
*నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ప్రచారచిత్రం విడుదల
పవన్ కళ్యాణ్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రూపొందిస్తోన్న మాగ్నమ్ ఓపస్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’.‘నిధి అగర్వాల్‘ నాయిక. మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్‌పై లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో నిర్మాత దయాకర్ రావు ఈ ఎపిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
నేడు నిధి అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ప్రచార చిత్రంను విడుదల చేశారు చిత్ర బృందం. “హరిహర వీరమల్లు” లో నిధి అగర్వాల్ ప్రధాన భూమికను పోషిస్తున్నారు. కధానాయిక గా ఆమె పోషిస్తున్న పాత్ర పేరు ‘పంచమి‘.
“కృష్ణ పక్ష పంచమి వెన్నెల వన్నెలవా..
శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా?
ఓ అందాల పంచమి.. ఎవరివే నీవెవరివే?” అంటూ ఆమెను వర్ణించారు. ప్రచార చిత్రంలో నృత్య భంగిమలో అందమైన ఆమె రూపం ను వీక్షిస్తే ఎంతో అందంగానూ, అపూర్వంగా ఉంది. విభిన్నమైన పాత్రగానూ, వెండితెరపై అలరిస్తుంది అనిపిస్తోంది. ఆమె పాత్ర ఎలా ఉంటుంది అన్నది మరింత ఉత్సుకతను కలిగిస్తోంది.
నేటి తరం దర్శకుల్లో ఒక ఇంద్రజాలికుడు లాంటి దర్శకుడు క్రిష్ తన ట్రేడ్‌మార్క్ అంశాలతో ఈ చిత్రాన్ని అపూర్వంగా తీర్చిదిద్దుతున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, అత్యద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా ఈ”హరిహర వీరమల్లు” సినిమా రూపొందుతోంది. ఇది భారతీయ సినిమాలో ఇప్పటిదాకా చెప్పని కథ. కచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది.
ఏ విషయంలోనూ రాజీపడని ఉన్నతస్థాయి నిర్మాణ విలువలతో నూటయాభై కోట్లకు పైగా భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో నిర్మాణమవుతోన్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళంభాషల్లో ఏక కాలంలో విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ యాభై శాతం పూర్తయింది. త్వరలో చిత్రం నూతన షెడ్యూల్ ప్రారంభం అవుతుందని నిర్మాత ఎ.దయాకర్ రావు తెలియచేశారు.
ఈ చిత్రానికి అగ్రశ్రేణి సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి సంగీత బాణీలు అందిస్తుండగా, పేరుపొందిన సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వి.ఎస్. కెమెరాను హ్యాండిల్ చేస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు సమకూరుస్తున్నారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లెజండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగాసూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
పీఆర్వో: లక్ష్మీ వేణుగోపాల్.