న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాజాగా ఈమూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది.

ఈ చిత్రంలోని గ్రాండ్ విజువల్స్‌, డ్రామాను చూసి సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను ప్రశంసించారు. మాస్ పాత్రలు చేయడం బాలకృష్ణకు కొత్తేమీ కాదు. కానీ ఈ సారి మాత్రం తనలోని విశ్వరూపాన్ని చూపించారు. అఘోరగా బాలకృష్ణ మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారు.

సెకండాఫ్‌లో బాలకృష్ణను అఘోర‌గా ఇంటెన్స్, యాక్షన్ అవతారంలో చూపించారు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. ద్వితీయార్థంలో బాలయ్య ఉగ్రరూపం కనిపిస్తుంది. మ‌రోవైపు శ్రీకాంత్ విలనిజం కూడా హైలెట్ అవ‌నుంది. జ‌గ‌ప‌తి బాబు పాత్ర కూడా ప్రేక్ష‌కుల‌ని మెప్పించ‌నుంది. త‌మ‌న్ మ్యూజిక్‌, ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ వ్యాల్యూస్ ఈ సినిమాకు మేజ‌ర్ అసెట్స్‌.

బాలకృష్ణ బోయపాటి శ్రీను కలిసి ఈ సారి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అయ్యారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌లో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. మిర్యాల రవిందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌పై అఖండ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సీ రాం ప్రసాద్ కెమెరామెన్‌గా, కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటర్‌గా  వ్యవహరిస్తున్నారు.

తమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకు, అలాగే రీసెంట్‌గా విడుద‌ల‌చేసిన ట్రైల‌ర్‌కు విశేషమైన స్పందన ల‌భించింది.