తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం `మిషన్ ఇంపాజిబుల్`. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ`ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరించారు. ముగ్గురు పిల్లలు గా రోషన్, బానుప్రకాష్, జైతీర్థ నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా బుధవారంనాడు ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగా గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ, కొన్ని ఫంక్షన్లకు ప్రేమతో వస్తాం. అలా నిర్మాత నిరంజన్ రెడ్డిపై వున్న సోదర ప్రేమతో వచ్చాను. చాలా తక్కువ సమయంలో నాకు అత్యంత ఆప్తుడిగా, సోదరుడిలా కలిసిపోయాడు. ఒకవైపు సుప్రీం కోర్డు లాయర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఎంతో బిజీగా వున్నా మరోవైపు సినిమాలు తీయడం ఆశ్చర్యం కలిగింది. నాతో ఆచార్య చేస్తున్నాడు. ఇప్పుడు మిషన్ ఇంపాజిబుల్ చేశారు. ఈ సినిమా గురించి నాకు చెబుతూ దర్శకుడి తీసిన `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా గురించి చెప్పాడు. అప్పుడు నేను చూడలేకపోయా. ఇప్పుడు తప్పకుండా చూస్తాను. నేను చేసిన చంటబ్బాయ్ స్పూర్తి అని దర్శకుడు అన్నాడు. మంచి కాంబినేషన్ కుదిరింది. నిర్మాత నిరంజన్ వైల్డ్ డాగ్ సినిమా తీసినప్పుడు నన్ను పిలవలేదు. నా ఫ్రెండ్ నాగార్జున పిలిచాడు అంటూ సరదాగా గుర్తు చేశారు.
ఇక ఈ సినిమా గురించి నిరంజన్ నాకు చెబుతూ, ఈ సినిమాను మీరు చూసి నచ్చితేనే ఫంక్షన్‌కు రమ్మన్నారు. సినిమా చూశాను. ఫ్యాబ్యులెస్ సినిమా. తాప్సీ ది చాలా పవర్‌ఫుల్ పాత్ర వుంటుంది. `పింక్`లో ఎంత అద్భుతంగా నటించిందో తెలిసిందే. ఝుమ్మంది నాదం చేసినప్పుడు వేడుకలో చూశాను. అప్పుడు చూసిన అమ్మాయేనా అనిపించింది. వృత్తిపరంగా నిబద్ధతతో తనకంటూ ఓ మార్క్ వేసుకుంది. తను నటించిన ఘాజ సినిమా చూశాను. ఇక ముగ్గురు పిల్లలు ఎంటర్‌టైన్ చేశారు. వీరిని చూస్తుంటే, నేను నటుడిగా అవ్వాలనుకునే బీజం ఏర్పడిన రోజు గుర్తుకు వస్తుంది. చిన్నతనంలో నేను 8వ తరగతి చదువుతుండగా బాలరాజు కథలో `మహాబలిపురం..`అని పాట పాడిన పిల్లాడు ప్రభాకర్ ప్రభావం నాపై వుంది. అలా పడిన బీజం నన్ను నటుడిగా మారేలా చేసింది. ఈ సినిమాలో పిల్లలు బాగా చేశారు. డాన్స్ అద్భుతంగా చేశారు. చాలా అమాయకత్వంతో చేసిన నటన బాగుంది. వారు క్రైంలో ఇరుక్కోవడం చాలా ఎంటర్ టైన్‌మెంట్ ఇస్తుంది. సెకండాఫ్‌లో దర్శకుడు స్వరూప్ అద్భుతంగా మలిచాడు. మేటర్, మెటీరియల్, టాలెంట్ వున్న దర్శకుడు స్వరూప్. ఈ సినిమాతో మరింత నిరూపించుకుంటాడు. చిన్న పిల్లల సినిమా అంటాం. కానీ ఇది పెద్దలు చూడాల్సిన సినిమా. నిర్మాత నిరంజన్ రెడ్డి కథ ఎంపిక చేశారంటే ఒక మార్క్ వుంటుంది. నిర్మాత అనేవాడు కేషియర్ కాదు. కథలో, ప్రాసెస్‌లో నిర్మాత ప్రమేయం వుండాలి. అశ్వనీదత్, అరవింద్, కె.ఎస్. రామారావు, దేవీప్రసాద్ వంటి నిర్మాతలు కథలోనూ, సంగీతం, కాస్ట్యూమ్ ఇలా అన్ని రంగాల్లో ఇన్‌వాల్వ్‌మెంట్ అవుతారు. అప్పుడే ఆర్టిస్టుకు భరోసా వుంటుంది. ఈ సినిమా బయటకు తీసుకువచ్చి నిలబెట్టాలనే భరోసా కలిగిస్తారు. కానీ క్రమేణా నిర్మాత పరిస్థితి కేషియర్ లా మారిపోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత అటువంటి నిర్మాత నిరంజన్ రెడ్డి అని చెప్పుకోవడం గర్వంగా వుంది. ఆచార్య తీస్తున్నప్పుడు దర్శకుడు కొరటాల శివతో తన అభిప్రాయాన్ని చెప్పే స్థాయి వుంది. దర్శకుడు, నిర్మాత ఒకేలా ఆలోచించేవిధంగా వుండాలి. ఒక ఈ సినిమాకు కెమెరామెన్‌గా చేసిన దీపక్, సంగీతం ఇచ్చిన మార్క్, కలర్‌ఫొటో హీరో సుహాస్ ను పేరుపేరున పలుకరించారు. పాండమిక్ టైంలో కలర్‌ఫొటో సినిమా చూశాను. బాగా నటించాడు. అలాగే కంచరపాలెం దర్శకుడు మహా, అర్జున్ రెడ్డి వంగా వంటి యంగ్ దర్శకులు మాకూ అసోసియేషన్ ఉంది. మీ సినిమా చూసి ఇన్ స్పైర్ అయ్యామని చెబుతుంటే ఆనందంగా వుంది. ఇలా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా వుంది.
తాప్సీ ఝుమ్మంది నాదం టైంలో చాలా క్యూట్‌గా వుంది. ఆ టైంలో నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయాను. అందుకే ఆమెతో నటించలేకపోయాను. కానీ ఇప్పుడు నిరంజన్‌రెడ్డి ఆమెతో మెయిన్ కాంబినేషన్ గా మా ఇద్దరినీ కలిపే కథ చూడండి అంటూనే. పింక్ లా అమితాబ్‌ను డామినేట్ చేస్తే నేను ఒప్పుకోను. అంటూ చమత్కరించారు.
అదేవిధంగా మిషన్ ఇంపాజిబుల్ అనేది చిన్న సినిమా కాదు. పెద్ద మనసుతో చూడతగ్గ సినిమా. ఇందులో చక్కటి ఆర్ట్ వుంది. మనసును రంజింపచేస్తుందని నేను హామీ ఇస్తున్నా. ఆర్.ఆర్.ఆర్. సినిమాకు పబ్లిసిటీ అవసరంలేదు. ఇలాంటి సినిమాకు కావాలి. ఇక ఆర్.ఆర్.ఆర్. సినిమా ద్వారా తెలుగు ఖ్యాతిని ప్రపంచ దేశాలకు తీసుకెళ్ళేలా చేసిన రాజమౌళి, అతని టీమ్ కు అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి చిన్న సినిమాను ఆదరిస్తే యంగ్ టాలెంట్ మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఏప్రిల్ 1న మీరంతా మాకు ఇచ్చే గిఫ్ట్ మిషన్ ఇంపాజిబుల్ అంటూ ముగించారు.
తెలుగులో చేశాను. చేస్తాను.- తాప్సీ పన్ను
తాప్సీ పన్ను మాట్లాడుతూ, ఝుమ్మంది నాదం సినిమా ఆడియోకు చిరంజీవిగారు వచ్చారు. నాకు స్పెషల్ మూవీ. ఆయన ఆశీస్సులు మరోసారి దక్కాయి. నిరంజన్‌రెడ్డిగారు నాకు ఘాజి సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా నాకు హ్యాట్రిక్ మూవీ కావాలి. దర్శకుడు స్వరూప్ చాలా సపోర్ట్ చేశారు. నా డేట్స్, ప్రయాణం వల్ల ఇబ్బందులున్నా ఎంతో సహకరించారు. ఈ సినిమాకు ముగ్గురు పిల్లలే హీరోలు. నేను చేసిన సినిమాలన్నింటిలోకీ యంగెస్ట్ హీరోలు వీరే. నేను రెండేళ్ళుగా హిందీలో బిజీగా వున్నా తెలుగులో చేయకపోవడానికి కారణం ఏమిటంటే లాజిక్ గా ఏమీ చెప్పలేను. నేను తెలుగులో చేశాను. చేస్తాను. చేస్తూనే వుంటాను అని తెలిపారు.
చిత్ర దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె మాట్లాడుతూ, చిరంజీవిగారు మా సినిమాకు సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్స్. ట్రైలర్ ను విడుదల చేసిన మహేష్‌బాబుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేను చేసిన `ఏజెంట్..` సినిమాకు స్పూర్తి చిరంజీవిగారి `చంటబ్బాయ్`. నేను చిరంజీవిగారి అభిమానిని. తిరుపతిలో సినిమాలు వస్తే కటౌట్లు కట్టేవాడిని. ఇక ఈ సినిమా తెరరూపం రావడానికి కారణం నిర్మాతలే. కోవిడ్ మొదటివేవ్‌లో కథ చెప్పాను. అప్పడు థియేటర్లు ఓపెన్ అవుతాయో లేవో అనే గందరగోళం నెలకొంది. అలాంటి సమయంలో ముగ్గురు పిల్లల కథ వెండితెరపై చూపాలన్న నిర్మాత ఆలోచనతో ముందుకు సాగారు. ఈ కథ రీత్యా స్ట్రాంగ్ హీరోయిన్ కావాలనుకున్నాం. తాప్సీగారు హిందీలో పింక్‌వంటి అద్భుతమైన సినిమాలు చేశారు.. ఆమె ఈ కథలో 45 నిముషాలు మాత్రమే వుంటుంది. అనుమానంగానే ఆమెను ముంబైలో కలిశాం. కథ విని వెంటనే చేస్తానన్నారు. పాత్రలో నిడివికాదు. కథ నచ్చి అంగీకరించారు. షూటింగ్‌లో ఎటువంటి సమస్య వున్నా అన్వేష్ రెడ్డిగారు పరిష్కరించేవారు.
ఈ సినిమాకు మార్క్.కె. రాబిన్ చక్కటి BGM తోపాటు సంగీతం బాగా ఇచ్చారు. కెమెరామెన్ దీపక్ నాకు బలం. ఆర్ట్ డైరెక్టర్, నా దర్శకుల టీమ్‌కు ధన్యవాదాలు. ఇక ముగ్గురు పిల్లలను ఎంపిక చేసి రెండు నెలలపాటు వర్క్‌షాప్ చేశాం. ఆ వయస్సులో వున్న కాన్ఫిడెన్స్ నాకు బాగా ఉపయోగపడింది. ఈ సినిమా తర్వాత ఈ ముగ్గురికీ మంచి పేరువస్తుంది. కోవిడ్ టైంలో వారి తల్లిదండ్రులు మమ్మల్ని నమ్మి పంపించారు. ఏప్రిల్ 1న సినిమా విడుదలవుతుంది. ఇది చిన్న పిల్లల సినిమాకాదు. పెద్దల్లోనే చిన్న పిల్లల అమాయకత్వం వుంటుంది. మనం పెద్దయ్యాక మనకు ఆరోజులు గుర్తుకు వస్తాయి. ఈ సినిమా బాల్యంలోకి తీసుకెళుతుంది. మంచి సినిమా చూసిన రెండుగంటలూ నవ్వేలా వుంటుందని హామీ ఇస్తున్నాను అన్నారు
నిర్మాతల్లో ఒకరైన నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, మహేష్‌బాబు ట్రైలర్ లాంచ్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చిరంజీవిగారు రావడం సక్సెస్ గా భావిస్తున్నాం. స్వరూప్ చేసిన మొదటి సినిమా చూడలేదు. `ఏజెంట్..` పెద్ద టైటిల్ ఏమిటి? అని మొదట అనిపించింది. నా స్నేహితులు బాగుందని చెప్పారు. సినిమా చూశాక దర్శకుడితో బాగుందని చెప్పాను. ఏదైనా కథ వుంటే రమ్మన్నాను. కథ చెప్పాడు. ఆ కథ వింటూనే నవ్వుతూనే వున్నాను. ఈ కథ స్నేహితులకు చెప్పాను. వారు తెగనవ్వారు. ఇలాంటి కథకు కీలక పాత్రలో తాప్సీ వుంటే బాగుంటుందని ఆమెకు కథ చెప్పాం. ఇప్పుడు మనం పాన్ ఇండియా సినిమా అంటున్నాం కానీ, తాప్సీ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎప్పుడో అయిపోయింది. మంచి దర్శకుడు, మంచి యాక్టర్ తోడయితే ఆచార్య, మిషన్ ఇంపాజిబుల్ వంటి సినిమాలు వస్తాయని అన్నారు.
సంగీత దర్శకుడు మార్క్‌రాబిన్ మాట్లాడుతూ, స్వరూప్‌తో `ఏజెంట్..` సినిమా చేశాను. అందుకే కష్టంగా అనిపించలేదు. అవకాశం ఇచ్చిన నిరంజన్ గారికి ధన్యవాదాలు. నేను చిరంజీవిగారికి పెద్ద అభిమానిని. ముఠామేస్త్రీలోని పాటలు విని ఇంట్లో డాన్స్ వేసేవాళ్లం. ఈ సినిమాలో నాలుగు పాటలున్నాయి. కృష్ణ, హసిత్ గోలి, ఎ.కె. గణేష్.. చక్కటి సాహిత్యం ఇచ్చారు. ఇందులో ముగ్గురు పిల్లలు బాగా నటించారు. వీరికి పెద్ద కెరీర్ వుంటుందని భావిస్తున్నానని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో వినోద్, మహ, రవీందర్ విజయ్, హర్షవర్ధన్, సుహాస్, సందీప్ రాజ్, కెమెరామాన్ దీపక్, రాహుల్ యాదవ్ పాల్గొన్నారు.
ఇందులో నటించిన బాల నటులు రోషన్, బానుప్రకాష్, జైతీర్థమెగాస్టార్ చిరంజీవి సినిమాల్లోని పాటలకు అనుగుణంగా డాన్స్ చేసి అలరించారు. అనంతరం మెగాస్టార్ ఆశీర్వచనాలు పొందారు