న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలై భారీ క‌లెక్ష‌న్లు సాధిస్తుంది. ఈ  సినిమా సక్సెస్ ను ఫైట్ మాస్టర్ స్ట‌న్ శివ, ఆయన కుమారులు కెవిన్, స్టీవెన్  మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు…

స్టంట్ శివ మాట్లాడుతూ..‘అఖండ సినిమాలో అఘోర ఎంట్రీ నుంచి క్లైమాక్స్ వరకు నేను ఫైట్స్ కంపోజ్ చేశాను. ఈ ఫైట్స్ ఇంత బాగా రావడానికి బోయపాటి శ్రీను గారు, బాలకృష్ణ గారు కారణం. ప్రతీ సినిమాకు కూడా బాగా ఫైట్స్ కంపోజ్ చేయాలి, అవార్డులు రావాలనే చేస్తాం. ఆ హీరో ఆ మూడ్‌లో వచ్చి మాస్టర్ చెప్పినట్టుగా చేస్తే అది కుదురుతుంది. బాలయ్య బాబు గారు అద్బుతంగా చేశారు. ఈ సినిమా కోసం 80 రోజులు పని చేశాను. 60 నుంచి 65 కేవలం యాక్షన్ సీక్వెన్స్ కోసమే చేశాను. మిగిలిన రోజుల్లో ఎలివేషన్స్ గురించి దర్శకుడితో ప్రయాణం చేశాను. ఇది వరకు నేను సింహా సినిమాకు ఇంట్రడక్షన్ ఫైట్ చేశాను. బోయపాటి గారు వేరే లెవెల్. ఆయన కథ చెప్పిన విధానం విన్న తరువాత..ఫైట్స్ ఎలా కంపోజ్ చేయాలా అని నా కుమారులిద్దరితో కలిసి ఆలోచించాను. అఘోరా అంటే మామూలు మనిషి కాదు.. తెలుగు ఇండస్ట్రీ అంటే మాస్, మంచి యాక్షన్ సీక్వెన్స్ కోరుకుంటారు. అందులోనూ బాలయ్య గారంటే వేరే లెవెల్ ఉండాలి. డిఫరెంట్‌గా ఉండాలని ఇలా డిజైన్  చేశాం. బోయపాటి గారి ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్ ఓ ఫైట్ మాస్టర్‌లానే ఉంటుంది. ఫైట్స్ ఇంత బాగా రావ‌డానికి నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి గారు కూడా ఎంతో స‌పోర్ట్ చేశారు. నా కొడుకులు ఈ సినిమాకు మంచి ఐడియాస్ ఇచ్చారు. మధ్యలో వాళ్లు ఇచ్చిన ఐడియాలు చూసి లోలోపల ఈర్ష్యపడ్డాను. మంచి ఐడియాస్ ఇచ్చినప్పుడు నేను తీసుకున్నాను.

తెలుగు ఆడియెన్స్ ఫుల్ మాస్. కొడితే అవతల పడిపోవాలని అనుకుంటారు. తమిళ్‌లో అలా కుదరదు. కానీ రజనీకాంత్ వంటి హీరోలకు మాత్రం అక్కడ కూడా అలా సెట్ అవుతుంది. బాలయ్య బాబు నుంచి ఏం కోరుకుంటారో అది ఇవ్వాల్సిందే. ఆయనతో నాలుగు సినిమాలకు పని చేశాను. ఈ ఫైట్లు ఇంత క్లిక్ అవ్వడానికి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణం. ఆయన ఇచ్చిన ఆర్ఆర్ వల్లే ఇంత బాగా ఎఫెక్ట్‌ వచ్చింది. మాకు ఫైట్స్ విషయంలో ఏం కావాలన్నా డైరెక్టర్ బోయపాటి గారిని అడిగేవాళ్లం. వెంటనే ఆయన మాకు సమకూర్చేవారు. క్లైమాక్స్‌ను వంద మందితో తీశాం. మేం ఈ సినిమాకు ఫైట్ మాస్టర్స్‌లా పని చేయలేదు. ఫ్యాన్స్‌లా పని చేశాం. బాలయ్య గారిలో ఓ పవర్ ఉంది. డెడికేషన్, క్రమశిక్షణ, టైమింగ్ మాకు చాలా ఇష్టం. ఇండియన్ సినిమాకు బాలయ్య ఓ సూపర్ హీరో. ఇక్కడ నేను నటుడిగా బిజీగా అవుతున్నాను. ఎఫ్ 3లో నేనే మెయిన్ విలన్. క్రాక్ తరువాత నటుడిగా ఆఫర్లు వస్తున్నాయి’ అని అన్నారు.