*8వ తరగతి వరకు టిసి లేకుండానే స్కూల్ లో చేరవచ్చు. తెలంగాణ విద్యా శాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన*
విద్యార్థులు ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలలో చేరాలంటే టీసీ (బదిలీ ధ్రువపత్రం) తప్పనిసరి. అయితే, ప్రైవేటు పాఠశాలలు టీసీ ఇచ్చే విషయంలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తుండడంపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన స్పందించారు. నిజానికి 8వ తరగతి వరకు పాఠశాలలో చేరేందుకు టీసీ అవసరం లేదని, విద్యాహక్కు చట్టంలో టీసీ అవసరం లేదన్న విషయం స్పష్టంగా ఉందన్నారు. ఈ విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే ఆయా జిల్లాల్లోని డీఈవోలను సంప్రదించాలని సూచించారు. కొత్త స్కూల్స్ లో చైల్డ్ ఇన్ఫో డేటాలో పేరు నమోదు అయ్యేలా చూడాలని శ్రీదేవసేన సూచించారు.
రాష్ట్రంలో జూలై 1 నుంచి విద్యాసంస్థలు తెరువనున్న నేపథ్యంలో స్కూల్ ఫీజులపై తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
ప్రస్తుత విద్యా సంవత్సరంలో సుమారుగా నెలన్నర కాలం మాత్రమే 6 తరగతి నుంచి 10 తరగతి వరకు ప్రత్యక్ష బోధన కొనసాగగా, మిగతా కాలమంతా కేవలం ఆన్లైన్ తరగతులే కొనసాగాయి. కొవిడ్‌తో చాలామంది ఉపాధి కోల్పోయారు. దాంతో ఈ విద్యా సంవత్సరం ఫీజులు ఎలా చెల్లించాలో తెలియక సతమతమవుతున్నారు. ఆన్లైన్ క్లాసుల పేరుతోనే కొంతమేర ఫీజులు వసూలు చేసిన ప్రైవేట్ యాజమాన్యాలు, జూలై 1 తర్వాత ఈ విద్యా సంవత్సరం మొత్తం ఫీజుతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ఫీజును కూడా వసూలు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఫీజుల చెల్లింపుపై ఆందోళన మొదలైంది.
కొవిడ్ నేపథ్యంలో కొంతమంది తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక పాఠశాలలు మార్చాలని భావిస్తుండగా, పూర్తి ఫీజు చెల్లిస్తేనే టీసీ ఇస్తామని ప్రైవేట్ యాజమాన్యాలు చెబుతున్నాయి. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకు టీసీ లేకుండానే విద్యార్థులను ఒక పాఠశాల నుంచి మరొక పాఠశాలకు మారొచ్చు. ప్రతి విద్యార్థికి వారి వయసును బట్టి పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలి. ప్రైవేట్ యాజమాన్యాలు కూడా ఫీజుల చెల్లింపుతో సంబంధం లేకుండా తమ పాఠశాలలో ఉన్న విద్యార్థుల వివరాలను చైల్డ్ ఇన్ఫో డాటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులు తమ పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్లిపోయినా చైల్డ్ ఇన్ఫో డాటా అప్డేట్ చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.*