తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరిగే ఛాన్స్​ ఉన్నదని ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. పాత జన్యురూపాన్ని మార్చుకొని వచ్చిన కొత్త రకం (బీఏ4) వైరస్​కి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని టెన్షన్​ పడుతుంది.ప్రస్తుతం ఈ వేరియంట్​ ప్రభావంతోనే సౌత్​ ఆఫ్రికా, యూకే తదితర దేశాల్లో కేసుల సంఖ్య పెరిగాయని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో మన దగ్గర అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెల్త్​ డిపార్ట్​మెంట్​ నొక్కి చెప్పింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు టెస్టింగ్​ కిట్లను సప్లై చేసింది. తీవ్రతను బట్టి కట్టడి చర్యలను స్పీడప్​చేస్తామని ఆఫీసర్లు తెలిపారు. అన్ని జిల్లాల వైద్యాధికారులకు కూడా ప్రభుత్వం బీఏ 4 అలెర్ట్​ ఇచ్చింది. సౌతాఫ్రికా, యూకే దేశాల నుంచి వచ్చినోళ్లను అబ్జర్వేషన్​ చేయాల్సిన అవసరం ఉన్నదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం గైడ్​లైన్స్ లేనందున క్వారంటైన్, నెగిటివ్​ ఎంట్రీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని ఓ అధికారి స్పష్టం చేశారు. అయితే బీఏ4 వేరియంట్​ ఇంతకు ముందు వచ్చినోళ్లకు, వ్యాక్సిన్​ తీసుకున్న వారిపై కూడా దాడి చేసే ప్రమాదం ఉన్నదని డబ్ల్యూహెచ్​ఓ స్పష్టం చేయడం ఆందోళనకరం. అయితే సివియారిటీ పరిస్థితులు రావని చెప్పడం కాస్త ఉపశమనం కలిగించే అంశం.

హైదరాబాద్​ వ్యక్తికి సోకలేదు: హెల్త్​ డైరెక్టర్​డా జీ శ్రీనివాసరావు

కరోనా కొత్త వేరియంట్ గురించి ఆందోళన అవసరం లేదు. అయితే హైదరాబాద్​లోని వ్యక్తికి బీఏ 4 సోకిందని వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆ వ్యక్తి దక్షిణా ఆఫ్రికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఓ సమావేశానికి హాజరై వెళ్లిపోయాడు. ఈ సమావేశంలో 24 మంది పాల్గొనగా, వారందరినీ గుర్తించి టెస్టులు చేశాం. అందరికీ నెగిటివ్ వచ్చింది. కొన్ని రోజుల పాటు అబ్జర్వేషన్‌లో కూడా ఉంచాం. ఇదంతా పది రోజుల క్రితం జరిగింది. అనవసరంగా తప్పుడు వార్తలు క్రియేట్​ చేసి జనాలను ఇబ్బంది పెట్టడం సరైన విధానం కాదు. మరోవైపు చాలా మంది బూస్టర్​ డోసుపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే వైరస్​ పూర్తిగా నియంత్రణలో ఉంది. కానీ కొత్త వేరియంట్లు వ్యాప్తి కి చెక్​ పెట్టేందుకు మరో ఏడాది పాటు బూస్టర్​ వ్యాక్సిన్లు అవసరం.