విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ టూటౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ వీరంగం సృష్టించింది. లంబాడిపేట ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి సమయంలో ఐదు బైక్‌లను తగలబెట్టారు.
నగర శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ నిత్యం గంజాయి మత్తులో కొందరు యువకులు అల్లర్లకు పాల్పడతారని సమాచారం.గంజాయి విషయాన్ని పోలీసులకు తాము చెబుతున్నట్లు అనుమానించే దుండగులు బైక్‌లను తగులబెట్టినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న టూటౌన్‌ కొత్తపేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.