జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్
వరంగల్ జిల్లా హన్మకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మే6వ తారీఖున తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు సంఘర్షణ సభను విజయంతం చేసిన కాంగ్రెస్ శ్రేణులందరికీ జిల్లా కాంగ్రెస్ తరపున డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 5 నియోజకవర్గాల వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి వచ్చిన అభిమానులు, రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతిఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాహుల్ గాంధీ సభను విజవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంఘర్షణ సభలో అఖిల భారత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు మరింత ఉత్సాహంగా పని చేయాలని అన్నారు. వరంగల్ డిక్లరేషను ప్రతి సామాన్య రైతు దగ్గరకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజక వర్గ, మండల, బూత్ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కొంతమంది నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, 70 ఏండ్ల పరిపాలన కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందని విమర్శిస్తున్నారని అలాంటి వారు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో గొప్ప సంస్కరణలు జరిగాయని అన్నారు. గొప్ప గొప్ప మేధావులు పనిచేసిన పార్టీ అని దేశానికి ఎంతో సేవలు చేశారని అన్నారు. గొప్ప చరిత్ర కలిగిన పార్టీని రాజకీయ పరిజ్ఞానం లేని కొందరు వ్యక్తులు విమర్శించడం సిగ్గు చేటని ఎద్దేవా చేశారు.
దేశ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకూ ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసిన పార్టీ ఎదైన ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు. నేషనల్లో గతంలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన పార్టీలు ఎంతో కాలం పనిచేయలేక పోయాయని ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ పేదల పక్షాన పోరాడుతునే ఉందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 70వేల కోట్ల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే వాగ్దానం ఇస్తోందని రాహుల్ గాంధీ వరంగల్డిక్లరేషన్లో చెప్పిన విధంగా ఏకకాలంలో 2లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని, ఏడాదికి 15వేల రూపాయలను వ్యవసాయ సాయం కింద ప్రతి రైతుకు అందజేస్తూ రైతు బీమాతో పాటు గిట్టుబాటు ధరను అందిజేస్తామని తెలిపారు.
నేషనల్లో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన ఏ పార్టీ ఇప్పుడు మనుగడలో లేదని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకుతింటున్న బీజేపీకి త్వరలోనే కాలం చెల్లుంతుదని జోష్యం చెప్పారు. ఇంకా మాయ మాటలతో ప్రజలను మోసం చేయాలని చూస్తే అవి నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే పెరిగిన నిత్యవసర ధరలు, పెట్రోల్, డిజిల్, గ్యాస్ ధరలను తగ్గించి. ప్రజల దగ్గరకి వచ్చి మాట్లాడాలని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే పాత చింతకాయ పచ్చడి మాటలు మానుకోని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ జావేద్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వర్ రావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం, జిల్లా నాయకులు ఎసిఎం. హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.