భద్రాచలం: భద్రాచలంలో వైభవంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు మూలమూర్తులకు ఏకాంతంగా తిరుకల్యాణం జరపనున్నారు.అనంతరం మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొస్తారు. మిథిలా స్టేడియంలో ముందుగా పుణ్యాహవచనం, విశ్వక్సేన ఆరాధన గావిస్తారు. యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు జరుపుతారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. రేపు వైభవంగా శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం నిర్వహిస్తారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో 1,400 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.