ఎన్నో విభిన్నమైన ధారావాహికలతో తెలుగు ప్రేక్షకులకు విన్నూత్న వినోదాన్ని అందిస్తున్న ఈటీవీ…ఇప్పుడు మరో సరికొత్త డైలీసీరియల్ తో అలరించబోతోంది. ఈ సీరియల్ ప్రత్యేకత ఏమింటే…మూడు దశాబ్దాల క్రితం అసాధారణ విజయాన్ని సాధించిన ఉషాకిరణ్ మూవీస్ ‘మౌనపోరాటం’ చిత్రానికి సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకు రావడం. అడవిలో స్వేచ్ఛగా, స్వచ్ఛంగా పెరిగిన ఓ గిరిజన యువతిని, పెద్ద ఉద్యోగం చేస్తూ – చిన్న మనసున్న ఓ పట్నం యువకుడు మోసం చేస్తే…అతని కారణంగా గర్భం దాల్చి, కడుపులోని బిడ్డకు తండ్రెవరో నిరూపించుకోవాల్సిన దయనీయ దుస్థితిలో ..ఆ ఒంటరి యువతి సాగించిన ‘మౌనపోరాటం’ ఆ రోజుల్లో అంతులేని సంచలనం కలిగించింది. మాయగాళ్ళ బారిన పడి దిక్కుతోచక రోదించే ఎంతో మంది అబలలకు, అమాయకులకు మార్గం చూపిన ఈ చిత్రం ఎన్నో అవార్డులు గెలుచుకుంది.
ఓ గిరిజన యువతి నిజ జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలకు తెరరూపం కల్పించిన ‘మౌనపోరాటం’ చిత్రంలో యమున , వినోద్ కుమార్ హీరో హీరోయిన్లు గా నటించారు. రామోజీ రావు నిర్మించిన ఈ చిత్రానికి ప్రఖ్యాత గాయని ఎస్.జానకి సంగీతం అందించగా, మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు.
దాదాపు ముప్ఫై మూడేళ్ళ తర్వాత మౌనపోరాటం సినిమాకు కొనసాగింపుగా ఇదే పేరుతో సరికొత్త డైలీ సీరియల్ ప్రారంభిస్తోంది ఈటీవీ. నాటి హీరోయిన్ యమున ఈ సీరియల్ లో అదే ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. అప్పటికీ ఇప్పటికీ కాలం మారినా పరిస్థితులు మారలేదు. అభాగ్యుల జీవితాలు మారలేదు.
అడవిలో పుట్టినా, పట్టుదలతో పై చదువులు చదివి, పాఠాలు చెప్పే అధ్యాపకురాలిగా బాధ్యతుల స్వీకరించిన ఆ గిరిజన యువతి ‘దుర్గ’ … ఈనాటి సామాజిక సమస్యలకు ఎలా స్పందించింది?
కన్నబిడ్డ దూరమైనా, పేగుబంధం ప్రశ్నార్ధకమైనా… నమ్మిన విలువల కోసం ఎలా ఉద్యమించింది? నిగ్గదీసే బంధాలకీ, నిప్పులాంటి బాధ్యతలకీ మధ్య జరిగిన సంఘర్షణలో ఆమె ఎటు పయనించింది? ఏం సాధించింది?
అడుగడుగునా ఆసక్తి రేకెత్తిస్తూ, అనూహ్య కథాకథనాలతో సాగే ‘మౌనపోరాటం’ డైలీ సీరియల్ లో యమున, సెల్వరాజ్, మనోజ్, బాబీ, వర్షిక ప్రధాన పాత్రల్లో నటించారు. ‘జై’ దర్శకత్వం వహించారు.
ఆరంభం నుంచే ఆకట్టుకునే ‘మౌనపోరాటం’ సీరియల్ ఏప్రిల్ 4 సోమవారం నుంచి ప్రతిరోజూ రాత్రి 8గంటలకు ఈటీవీలో ప్రసారమవుతుంది.