గవర్నర్‌ తమిళిశైపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు. ఆయన ఈ విషయం బయట ఎక్కడా చెప్పరు. నిన్నామొన్నటి వరకూ రాజగురువుగా ఉన్న చినజీయర్‌పై ఎలాంటి ఆగ్రహంతో దూరం పెట్టారో అలాంటి ఆగ్రహమే గవర్నర్‌పైనా ఉంది.
కేసీఆర్ ఆగ్రహం చెందారంటే వారిని పట్టించుకోరని అర్థం. ప్రస్తుతం గవర్నర్‌ను కూడా ఆయన కలవడం లేదు. గవర్నర్ పాల్గొనే కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. కొద్ది రోజుల కిందట గవర్నర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం తరపున ఓ నోట్ కూడా విడుదలైంది. గవర్నర్ తన పరిమితుల్లో తాను ఉండాలనేది ఆ నోట్ సారాంశం.

అయితే కేసీఆర్‌తో ఎలాంటి వైరం పెట్టుకోవాలని గవర్నర్ అనుకోవడం లేదు. అందుకే ఆమె పరిస్థితిని మార్చడానికి రాజ్‌భవన్‌లో ఉగాది వేడుకలకు హాజరు కావాలని సీఎంకు ఆహ్వానం పంపారు. ఈ విషయంలో ప్రగతి భవన్ వర్గాలు ఎలా స్పందించాయో స్పష్టత లేదు. ప్రగతి భవన్‌లో రెండో తేదీన ఉగాది వేడుకలు జరుగుతాయి. ఆ రోజున ఆహ్వానిస్తే కేసీఆర్ రారన్న ఉద్దేశంతో ఒక రోజు ముందుగానే ఒకటో తేదీనే రాజ్ భవన్‌ లో వేడుకలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌కు ప్రత్యేకమైన కార్యక్రమాలు లేవు. ఆయన ఢిల్లీ పర్యటన కూడా వాయిదా పడింది.
ఇప్పుడు కేసీఆర్ గవర్నర్ ఆహ్వానాన్ని మన్నించి రాజ్ భవన్‌కు వెళ్తే వివాదానికి తెరపడినట్లే అనుకోవాలి. ఒక వేళ కేసీఆర్ పట్టించుకోకపోతే ఇక తమిళిశైతో మాటలు కూడా ఉండవని అనుకోవచ్చు. గవర్నర్‌గా నరసింహన్ ఉన్నంత కాలం కేసీఆర్‌కు రాజ్ భవన్‌కు ఎలాంటి సమస్యా రాలేదు. ఆయన రాజ్ భవన్‌కు రెగ్యులర్ విజిటర్‌గా ఉండేవారు.