ముంబై: ప్రముఖ గాయని, భారతరత్న పురస్కార గ్రహీత, గానకోకిల లత మంగేష్కర్(92) ఆదివారం ఉదయం కన్నుమూశారు. వివాదాలకు అతీతంగా, అభిమానులకు సమీపంగా ఉండే మహోన్నత వ్యక్తిత్వం ఆమెది.
30కి పైగా భారతీయ, విదేశీ భాషల్లో వేల గీతాలను ఆలపించారు. అత్యధికంగా హిందీ, మరాఠీ భాషల్లో ఆమె పాటలు పాడారు. 92 ఏళ్ల లతా మంగేష్కర్ జనవరి 11న కొవిడ్‌ స్వల్ప లక్షణాలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆమె కరోనా నుంచి కోలుకొన్నట్లు వైద్యులు, కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే శనివారం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మరోసారి క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. ఆదివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు.

ఐదో యేటనే మొదలైన పాటల ప్రస్థానం..

ప్రముఖ థియేటర్‌ యాక్టర్‌, క్లాసికల్‌ సింగర్‌ అయిన పండిట్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌, షీవంతి దంపతులకు 1929 సెప్టెంబర్‌ 28న పుట్టిన లతామంగేష్కర్‌ జన్మించారు. తల్లిదండ్రులు తొలుత ఆమెకు హేమ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత లతగా నామకరణం చేశారు. ఆశా భోంస్లే, ఉషా మంగేష్కర్‌, హృదయనాథ్‌ మంగేష్కర్‌, మీనా కదికర్‌లు లత మంగేష్కర్‌కు తోబుట్టువులు. తండ్రి వద్దే సంగీతంలో ఓనమాలు నేర్చుకున్న లత ఐదేళ్ల వయసులో ఆలపించటం మొదలు పెట్టారు. లత పాఠశాలకు వెళ్లలేదు. ఒక రోజు తన సోదరి ఆశాను తీసుకుని పాఠశాలకు వెళ్లగా, ఉపాధ్యాయులు అనుమతించలేదు. అదే ఆమె పాఠశాలకు వెళ్లిన, మొదటి చివరి రోజు కావటం గమనార్హం. ఆపై సంగీత సాధన మొదలు పెట్టిన ఆమె తండ్రి మరణంతో నటిగా మారాల్సి వచ్చింది. ఒకవైపు నటిస్తూనే, మరోవైపు పాటలు పాడటాన్ని ఆమె ఆపలేదు.
తొలి పాట ఎడిటింగ్‌లో పోయింది
లత మంగేష్కర్‌ తొలిసారి ఓ మరాఠీ చిత్రంతో నేపథ్య గాయనిగా మారారు. అయితే, ఆ పాట సినిమాలో లేకపోవటం గమనార్హం. 1942లో ‘కిటీ హసాల్‌’ కోసం ఆమె పాడిన పాటను ఎడిటింగ్‌లో తీసేశారు. వినాయక్‌ మాస్టర్‌ సంగీత సారథ్యం వహించిన ‘పెహలీ మంగళాగౌర్'(1942)లో లతకు చిన్న వేషం ఇచ్చారు. ఇదే చిత్రంలో ఆమె ‘నటాలీ చైత్రాచీ’ అనే పాటలను పాడారు. హిందీలో ‘మాట ఏక్‌ సపూట్‌కి దునియా బదల్‌దా తు’ అనే పాటకు మరాఠీ చిత్రం ‘గజబావూ’ కోసం పాడారు. 1945లో వినాయక్‌ మాస్టర్‌ కంపెనీ ముంబయికి మారడంతో లత కూడా అక్కడే వెళ్లారు. ముంబయిలో హిందుస్థానీ క్లాసికల్‌ మ్యూజిక్‌ నేర్చుకుని ఒక్కో మెట్టు ఎక్కుతూ వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. వేల పాటలను ఆలపించారు.