అమరావతి: ఏపీలో వచ్చిన వరదల్లో చనిపోయినవారివి కచ్చితంగా ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ముంపు ప్రాంతాలకు వెళితే సహాయక కార్యక్రమాలకు ఆటంకమంటూ సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన చేతగానితనానికి నిదర్శనమన్నారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. వరదల్లో అధికార యంత్రాంగం వైఫల్యంపై న్యాయవిచారణ జరిపించాలని పునరుద్ఘాటించారు. బాధితులకు ఇంతవరకు నష్టపరిహారం అందలేదని.. డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధులు రూ.1,100 కోట్లు బాధితులకు ఇవ్వకుండా దారిమళ్లించారని ఆరోపించారు. వరి వేయొద్దని చెబుతూ రైతులను వ్యవసాయానికి దూరం చేస్తున్నారన్నారు. బీమా కట్టకపోవడంతో రైతులకు పరిహారం అందని పరిస్థితి నెలకొందని చెప్పారు. ఓటీఎస్‌ పథకం పేరుతో రూ.14,261 కోట్లు పేదల నుంచి వసూలు చేయడాన్ని విరమించుకోవాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలు చర్చించే గౌరవ శాసనసభను కౌరవ సభగా మార్చారని దుయ్యబట్టారు. అన్ని గ్రామాలు, పట్టణాల్లో గౌరవ సభలు నిర్వహించి మహిళల పట్ల వైకాపా వైఖరితో పాటు క్షేత్రస్థాయి సమస్యలు, ప్రజాసమస్యలు చర్చిస్తామన్నారు. డ్వాక్రా మహిళలు ఎల్‌ఐసీలో పొదుపు చేసుకున్న రూ.2,200 కోట్లను స్వాహా చేశారని చంద్రబాబు ఆరోపించారు. చట్ట వ్యతిరేక నిధుల బదిలీ ప్రక్రియను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ విధ్వంస తీరు, విపరీతమైన అప్పులతో రాష్ట్ర బ్రాండ్‌ దెబ్బతింటోందన్నారు.