డాలర్ శేషాద్రి అంటే తెలియని శ్రీవారి భక్తులు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. అంతగా వారు శ్రీవారి ఆలయం చుట్టూ అనుబంధం ఏర్పరుచుకున్నారు. సాదారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించిన డాలర్ శేషాద్రి టిటిడిలో అసాధారణ స్థాయికి చేరుకుని నేడు తుది శ్వాస విడిచారు. దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో డాలర్ శేషాద్రికి ఓ పేజీ ఉంటుంది. వారి మృతికి సంతాపం.
వ్యక్తిగతంగా నేను కొన్ని సంవత్సరాల క్రితం తిరుమలలో జరిగిన ఒక సంఘటనలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేసాను. అప్పుడు వారు నాకు తొలి పరిచయం. వారు పిలిచి వివరణ ఇచ్చిన తీరు నాకు నచ్చింది. అయిన చుట్టూ వివాదాలు ఉన్నా తన పని తాను చేసుకుని పోయే మనస్తత్వం డాలర్ ప్రత్యేకత. రాజకీయాలలో పరస్పరం తీవ్రంగా విభేదించుకునే పార్టీలు అధికారంలోకి వచ్చినా డాలర్ శేషాద్రి స్థానం మారదు. అంతగా శ్రీవారి ఆలయ వ్యవహారాల్లో తన ముద్ర వేశారు డాలర్.
ఈ మధ్య శ్రీవారి ఆలయంలో జరిగిన మార్పు విషయంలో చిన్న పాటి వివాదం నెలకొంది. అది అపోహ మాత్రమే. దానిపైన నేను స్పందించాను. దాని చూసి మరింత విపులంగా మాట్లాడితే బాగుంటుంది అని భావించిన తిరుమల ప్రత్యేక అధికారి ధర్మారెడ్డి గారు నన్ను డాలర్ శేషాద్రి గారితో మాట్లాడని చెప్పారు. ఆ సందర్భంగా వారితో మాట్లాడినప్పుడు ఆలయ చరిత్ర , ఇతర ఆలయాలకు తిరుమలకు ఉన్న ప్రత్యేకతలను తన అనుభవముతో చెప్పిన తీరు చూసిన తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చిన , ఏ అధికారి మారినా డాలర్ శేషాద్రికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకున్నాను. ఆలయ సాంప్రదాయాల పట్ల అవగాహన కలిగి ఉండటం మాత్రమే కాదు. అందులో భాగస్వామ్యం కావడం తప్ప మరో వ్యాపకం లేని జీవితం డాలర్ శేషాద్రి గారిది. అందుకే టిటిడి చరిత్రలో అనేక మందికి వారి కృషి కారణంగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అలాంటి వారి కోవలో డాలర్ శేషాద్రి గారు ఉంటారు. వారి మృతికి సంతాపం.