కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు పని చేశాం, ముఖ్యంగా ఖైదీ సినిమాకు సలీం మాస్టర్ అసిస్టెంట్ గా నాకు చాలా స్టెప్స్ ఆయనే కంపోజ్ చేశారు, అప్పుడు మొదలైన మా స్నేహం చాలా బలపడింది. తర్వాత కూడా ఎన్నో సినిమాలకు కలిసి పని చేశాం. చరణ్ బ్లాక్ బస్టర్ అయిన మగధీర సినిమాలోని ధీర ధీర పాటకు శి‌వశంకర్ మాస్టర్ కు జాతీయ అవార్డ్ కూడా పొందారు. ఆయనను చివరిగా ఆచార్య సెట్స్ లో కలిశాను, అదే చివరి సారి అవుతుందని అస్సలు ఊహించలేదు, ఒక ఆత్మీయుడిని కోల్పోయినట్టు అనిపిస్తోంది. ఆయన మృతి కేవలం నృత్య కళా రంగానికే కాదు, యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు’ అని చిరంజీవి పేర్కొన్నారు. ఆయన తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.