ఇటీవ‌ల జ‌రిగిన‌ తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా ముగిసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్ డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ గారితో పాటు, తెలంగాణ మా ప్రెసిడెంట్ ర‌ష్మి ఠాకూర్‌, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మ‌న్ నెహ్రు, డైరెక్ట‌ర్స్‌ అసోసియేస్ ప్రెసిడెంట్‌ ర‌మేష్ నాయుడు త‌దిత‌రులు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర రాజ‌న్‌ను గ‌వ‌ర్న‌ర్ క‌ర్యాల‌యంలో క‌లిసి ఆశీస్సులు తీసుకున్నారు.
ప‌దివేల మంది స‌భ్యులున్న తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఎన్నిక‌లు ఏక‌గ్రీవంగా జ‌రిగినందుకు, స‌భ్యుల మ‌ధ్య ఉన్న ఐక్య‌మ‌త్యాన్ని, ముందుండి దిశానిర్దేశం చేస్తున్న ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ గారిని గ‌వ‌ర్న‌ర్‌ అభినందించారు.

అలాగే తెలంగాణ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని స‌మస్య‌ల‌ను టిఎఫ్‌సిసి ఛైర్మ‌న్‌ గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించారు. ముఖ్యంగా ఇండ‌స్ట్రీ అభివృద్ధి కోసం నిర్మాత‌ల‌కు, థియేట‌ర్ల‌కు జీఎస్‌టీ మిన‌హాయించాల‌ని కోరారు. ఈ స‌మ‌స్య‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై గారు సానుకూలంగా స్పందించారు. తెలంగాణ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌ స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆమె హామీ ఇచ్చారు.  

త‌మ‌ విలువై స‌మ‌యాన్ని కేటాయించి టిఎఫ్‌సిసి కార్య‌వ‌ర్గాన్ని అభినందించినందుకు ఛైర్మ‌న్ డా.ల‌య‌న్ ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ గ‌వ‌ర్న‌ర్‌ త‌మిళిసై గారికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..“ తెలంగాణ చిత్ర ప‌రిశ్ర‌మలోని కార్మికుల కోసం ఏర్పాటైన టిఎఫ్‌సిసి గ‌త ఏడేళ్ళుగా విజ‌య‌వంతంగా న‌డుస్తోంది. ఇందుకు స‌హ‌క‌రించిన స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు, అలాగే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏక‌గ్రీవంగా ఎన్నికైన కార్య‌వ‌ర్గంతో ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా టిఎఫ్‌సిసి అభివృద్ధి ప‌నులు ప్రారంభించింది. ఇందులో భాగంగా గ‌వ‌ర్న‌ర్ గారిని క‌లిసి స‌మ‌స్య‌ల‌ను విన్న‌వించ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లో స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కానున్నాయి. స‌భ్యుల సంక్షేమం కోసం హెల్త్ కార్డుల‌తో పాటు ప‌లు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్ట‌డం జ‌రిగింది. చిన్న సినిమాల‌ను ఆద‌రించ‌డంతో టిఎఫ్‌సిసి ముందుంటుంది. టిఎఫ్‌సిసి అటు నిర్మాత‌ల‌కు, ఇటు కార్మికుల‌కు ఎల్ల‌ప్పుడూ అండంగా ఉంటుంది. అని తెలిపారు.