పెద్ద ఎత్తున హాజరైన గులాబీ శ్రేణులు

నిజామాబాద్ కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వెంటరాగా, నిజామాబాద్ కలెక్టరేట్ లో కవిత నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు.

నామినేషన్ వేసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత గారు మాట్లాడుతూ, రెండోసారి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం కల్పించిన టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధ్యక్షులు సీఎం కేసీఆర్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. గతంలో పోటీ చేసినప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఓటేసి గెలిపించారన్న ఎమ్మెల్సీ కవిత, ఈ సంవత్సర కాలంలో సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో టీఆర్ఎస్ శాసనసభ్యులు ఉండగా, దాదాపు 90 శాతం మంది స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారేనన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం కేసీఆర్ గారు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మరోసారి ఇచ్చిన అవకాశాన్ని జయప్రదం చేసేవిధంగా స్థానిక సంస్థల సభ్యులంతా సహకరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు.

ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత గారు ఖరారు కావడంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. నామినేషన్ దాఖలు చేసేందుకు మంగళవారం ఉదయం ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ నుండి నిజామాబాద్ బయలుదేరారు. కామారెడ్డి టేక్రియాల్ దగ్గర స్థానిక టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తున హాజరై ఎమ్మెల్సీ కవితకు మంగళహారతులతో స్వాగతం పలికారు. బాణసంచా పేళుళ్లు, డప్పు చప్పులతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఇందల్ వాయి టోల్ ప్లాజా, డిచ్ పల్లి వద్ద సైతం నాయకులు, కార్యకర్తులు అధిక సంఖ్యలో హాజరై ఎమ్మెల్సీ కవితకు పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు.

నిజామాబాద్ చేరుకున్న ఎమ్మెల్సీ కవిత గారికి దారిపోడవునా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో పట్టణమంతా గులాబీమయంగా మారింది. కార్యకర్తలు అడుగడుగునా తమ అభిమాన నాయకురాలిపై పూల వర్షం కురిపించారు. కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఎమ్మెల్సీ కవిత కలెక్టరేట్ వైపు ముందుకు సాగారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలు పెంచేండం, స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ కవిత మరోసారి మండలి అభ్యర్థిగా ఎంపిక కావడంపై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీలు బీబీ పాటిల్, సురేష్ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ జడ్పీ ఛైర్మన్ దాదాన్న గారి విఠల్, కామారెడ్డి జెడ్పీ చైర్మన్ దఫేదార్ శోభ, ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, షకీల్, గంప గోవర్ధన్, నిజామాబాద్ మేయర్ నీతూ కిరణ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.