వెబ్ సిరీస్‌లు, డైరెక్ట్‌-టు-డిజిట‌ల్ రిలీజ్‌లు, ఒరిజిన‌ల్ మూవీస్‌, డిజిట‌ల్ రిలీజ్‌లు… ఏవి చూడాలని అనుకున్నా ప్రజల ఫస్ట్ ఆప్షన్ ‘జీ 5’. దేశంలోనే అగ్రగామి ఓటీటీ వేదిక. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వీక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. గత ఏడాది ‘అమృత రామమ్’ నుండి మొదలుపెడితే ’47 డేస్’, ‘మేకా సూరి’, ‘బట్టల రామస్వామి బయోపిక్కు’, ఇటీవల ‘నెట్’, ‘అలాంటి సిత్రాలు’ వరకూ ఎన్నో సినిమాలను ‘జీ 5’ డైరెక్ట్-టు-డిజిటల్ రిలీజ్ చేసింది. ఈ ఏడాది ఒరిజినల్ మూవీ ‘హెడ్స్ అండ్ టేల్స్’ను విడుదల చేసింది. తాజాగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS) ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది.

సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ జంటగా… సీనియర్ నరేష్, తులసి, ‘గెటప్’ శీను ప్రధాన, ప్రమీల రాణి (భామ) పాత్రల్లో నటించిన ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ (OCFS). పింక్ ఎలిఫెంట్స్ పిక్చర్స్ పతాకంపై మెగా డాటర్ నిహారికా కొణిదెల నిర్మించారు. మహేష్ ఉప్పాల దర్శకత్వం వహించారు. ఆయనతో కలిసి మానసా శర్మ కథ, మాటలు అందించారు. మొత్తం ఐదు ఎపిసోడ్స్ గల ఈ వెబ్ సిరీస్ నవంబర్ 19న ‘జీ 5’ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రాత్రి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వరుణ్ తేజ్, వెబ్ సిరీస్ లో ‘అరే మహేషా…’ పాటను విడుదల చేశారు.  

వరుణ్ తేజ్ మాట్లాడుతూ “బహుశా… ఏడాది క్రితం వెబ్ సిరీస్ చేస్తున్నట్టు నిహారిక చెప్పింది. స్టోరీ, టైటిల్ ఏమీ చెప్పలేదు. తనకెప్పుడూ ‘ఇది చెయ్, అది చెయ్’ అని చెప్పలేదు. ప్రయోగాలు చేస్తూ తన దారి వెతుక్కోవాలని అనుకుంటుంది. నిహారిక వర్క్ లో మేం ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వం. చూసి బావుందో, లేదో చెబుతాం. ఇటీవల ట్రైలర్ చూపించినప్పుడు నిజంగా నేను షాకయ్యా. ట్రైలర్ బావుంది. నాకు సంతోష్ శోభన్ తెలుసు. కానీ, తనకు బ్రదర్ ఉన్నాడని తెలియదు. ట్రైలర్ చూశాక… ‘ఈ అబ్బాయి ఎవరు? ఇంత బాగా చేస్తున్నాడు. ఇంతకు ముందు ఎన్ని సినిమాలు చేశాడు?’ అని అడిగా. తన టైమింగ్, యాక్టింగ్ అద్భుతంగా ఉన్నాయి. అనుభవం ఉన్న నటుడిలా చేశాడు. నేను ఈ వెబ్ సిరీస్ చూడాలని అనుకోవడానికి గల కారణాల్లో అతడూ ఒకడు. సంతోష్, సంగీత్ ను చూసి వాళ్ల నాన్నగారు గర్వపడతారు. నరేష్ గారి లాంటి ఆర్టిస్ట్ సినిమాలతో పాటు ఓటీటీ ప్రాజెక్టులు చేయడం కొత్తవాళ్లకు చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. అందరూ సినిమా క్వాలిటీలో ఉందని చెబుతున్నారు. పోను పోనూ సినిమాకు, ఓటీటీకి డిఫరెన్స్ ఉండదు. మనం చూసే మీడియమ్ డిఫరెంట్ అవ్వొచ్చు. సినిమా అంటే థియేటర్లు, ఓటీటీ అంటే ఇంట్లో చూడవచ్చు. అందరం కంటెంట్ ను నమ్ముకుని వచ్చినవాళ్లం. సినిమా వల్ల చాలామందికి ఒక ఫ్లాట్‌ఫార్మ్ ఉంటుంది. బయట ఎంతోమంది టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. అయితే, సినిమా వల్ల వాళ్లందరికీ ఒక లెవల్ వరకూ అవకాశాలు వస్తాయి. ఓటీటీ వల్ల చాలామందికి అవకాశాలు వస్తున్నాయి. ఇటువంటి ఫ్లాట్‌ఫార్మ్ క్రియేట్ చేసిన ‘జీ 5’ వాళ్లకు థాంక్స్. ఈ నెల 19న ‘జీ 5’ ఓటీటీలో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. అందరూ ఇంట్లో ఫ్యామిలీస్ తో కూర్చుని ఈ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.      

నరేష్ వీకే మాట్లాడుతూ “ఒక్కొక్క ఫ్యామిలీకి సముద్రమంత లోతు ఉంటుంది. మానస, మహేష్ ఉప్పాల మంచి ఫ్యామిలీ క్రియేట్ చేశారు. నేను రెండొందల సినిమాలు చేశానేమో? కౌంట్ చేయలేదు. లవ్లీ వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ’తో కొత్త ప్రయాణం ప్రారంభించడం సంతోషంగా ఉంది. మా నిర్మాత నిహారికాకు ముందుగా థాంక్స్ చెప్పాలి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే టైటిల్ తో ఎంతో వెయిట్ ఉంది. ప్రతి ఫ్యామిలీలో ఒక స్టోరీ ఉంటుంది. అది వాళ్లకే తెలుస్తుంది. బయట వాళ్లకు చాలా తక్కువ తెలుస్తుంది. దాన్ని చాలా అందంగా రాశారు. 27 రోజుల్లో తీశారంటే… చుట్టేశారని అనుకోవద్దు. సెట్ లో ఒక్క నిమిషం వేస్ట్ కాకుండా పక్కా ప్లానింగ్ తో చేశారు. మంచి క్వాలిటీతో తీశారు. సంగీత్ చాలా నేచురల్ గా చేశాడు. అతని అన్నయ్య సంతోష్ కు అదే విషయం చెప్పాను. వాళ్లది ఫిల్మ్ ఫ్యామిలీ. సంగీత్ తండ్రి శోభన్ మాకు క్లోజ్” అని అన్నారు.  

నిహారికా కొణిదెల మాట్లాడుతూ “ఆరేళ్ల క్రితం ‘ముద్దపప్పు ఆవకాయ్’తో పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను… నా ఫ్రెండ్ తో కలిసి! తర్వాత పింక్ ఎలిఫెంట్స్ ప్రొడక్షన్ లో మా నాన్నగారితో కలిసి ‘నాన్నకూచి’ అని ఇంకో వెబ్ సిరీస్ చేశా. ఆ రెండు ప్రాజెక్ట్స్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. నా ప్రొడక్షన్ హౌస్ వరకూ ‘జీ 5’ ఇల్లు లాంటిది. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’… ఇదొక కామెడీ ఫ్యామిలీ డ్రామా. ఈ మూడు ప్రాజెక్ట్స్ నాకు చాలా స్పెషల్. నాకు బాగా నచ్చి ముందునుంచి వీటితో ట్రావెల్ అయ్యాను. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ గురించి చెప్పాలంటే… నాకు మహేష్ గారు, మానస ముందు చెప్పినప్పుడు… ‘మహేష్ గారు! ఇది మీ కథేనా? మీకు లోన్స్ ఉన్నాయా?’ అని అడిగేశాను. ‘లేవు. నేను చూసిన సంఘటనల నుంచి రాసిన కథ’ అన్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి దర్శకుడు మహేష్, ఆయనతో పాటు కథ రాసిన మానస నిద్ర లేకుండా రేయింబవళ్లు కష్టపడ్డారు. నటుడిగా, వ్యక్తిగా సంగీత్ శోభన్ ను ఇష్టపడనివారు ఉండరు. అతను చాలా టాలెంటెడ్. సూపర్బ్ ఎంటర్టైనర్. తనను స్క్రీన్ మీద చూడటం నాకు ఇష్టం. కీర్తీ పాత్రకు ఎవరు సూటవుతారని చాలా చాలా వెతికాం. ఫైనల్లీ… సిమ్రాన్ శర్మ దొరికింది. తాను చాలా హార్డ్ వర్కర్. నరేష్ గారు వెబ్ సిరీస్ లో ఇప్పటివరకూ చేయలేదు. నా కోసం ఒప్పుకొన్నారు. మా చిన్న ఫ్యామిలీ ఆయన చాలా పెద్ద పార్ట్ ప్లే చేశారు. అలాగే, తులసిగారు. వాళ్లిద్దరితో నేను ఒక సినిమాలో యాక్ట్ చేశా. ఆ చనువుతో అడిగా. తులసిగారు కథ వినకముందే ‘నీ కోసం చేస్తా’ అని చెప్పారు. ప్రమీల గారి లాంటి అమ్మమ్మను అందరూ చూసి ఉంటారు. రాజీవ్ కనకాలగారు, వీర శంకర్ గారు, ‘టెంపర్’ వంశీగారు మా ప్రాజెక్టులో పార్ట్ అయినందుకు థాంక్స్. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’లో ప్రతి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. అందుకని, ఆచితూచి ఎంపిక చేశాం. మా సినిమాటోగ్రాఫర్ రాజ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ పీకే, ఆర్ట్ డైరెక్టర్ చిన్నగారు, ఎడిటర్ ప్రవీణ్ పూడి గారు, లిరిసిస్ట్ శ్రీమణి గారు… టెక్నికల్ టీమ్ అందరూ దీన్ని ఒక వెబ్ సిరీస్ కింద చూడలేదు. డైరెక్షన్ టీమ్ చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రసాద్ నిమ్మకాయల గారు… ‘జీ 5’ తరఫున ఆయనే ముందు కథ విన్నారు. మా మీద నమ్మకం ఉంచారు. ‘జీ 5’తో మా ప్రయాణాన్ని ఇదే విధంగా కొనసాగించాలని కోరుకుంటున్నాను. ప్రోడక్ట్ మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా అందరి కాన్ఫిడెన్స్ నా ముఖం మీద కనిపిస్తోంది. నాకు చాలాసార్లు ఫోన్స్ వచ్చాయి… ‘మేడమ్ మీకు 25 లక్షలు లోన్ కావాలా?’ అని. ‘నాకు ఏ లోనూ వద్దు’ అని చెప్పేదాన్ని. మహేష్ గారు ఈ కథ చెప్పిన తర్వాత నాకు అసలు ఎప్పటికీ లోన్ వద్దని అనుకుంటున్నాను. నవంబర్ 19న ‘జీ 5’లో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వచ్చేస్తుంది. మీ అందరికీ చాలా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ “నిర్మాతగా నీహా (నిహారికా)ఇంతకు ముందు ప్రాజెక్ట్స్ చేసింది. అప్పుడు నేను లేను. ఈ ప్రాజెక్టు చేసేటప్పుడు తనను దగ్గరనుంచి చూశా. నిర్మాతగా నిహారిక చాలా టెన్షన్స్ తీసుకుంది. నేను రెండుమూడు సార్లు సెట్స్ కు వెళ్లాను. చాలా హార్డ్ వర్క్ చేశారు. చాలా స్పీడుగా చేశారు. 27 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేశారు.

‘జీ 5’ అనురాధ మాట్లాడుతూ “వసుదైక కుటుంబం అనేదాన్ని ‘జీ’ నెట్వర్క్ నమ్ముతుంది. ఇప్పుడు ప్రపంచమంతా ఓ కుటుంబం అయ్యింది. టీవీ, జీ స్టూడియోస్ ప్రొడక్షన్ హౌస్, ఇప్పుడు ‘జీ 5’ ద్వారా మేం 190కు పైగా దేశాలకు దగ్గరయ్యాం. స్మాలెస్ట్‌, క్యూటెస్ట్‌, ఫ‌న్నీయెస్ట్‌ ఫ్యామిలీ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మా లార్జెస్ట్ హోమ్ గ్రౌండ్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఆహ్వానం పలుకుతోంది. నిహారిక ప్రొడక్షన్ హౌస్ పింక్ ఎలిఫెంట్స్ నుంచి వచ్చిన ఆసక్తికరమైన కథ ఇది. దర్శకుడు మహేష్ ఉప్పాల బాగా తీశారు. నటీనటులు అందరూ చక్కగా నటించారు. నేను ఈ వెబ్ సిరీస్ చూసేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈ నెల 19న ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ ‘జీ 5’లో స్ట్రీమింగ్ అవుతుంది. యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి” అని అన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ “మా ఫస్ట్ పోస్టర్ విడుదల చేసిన నాగబాబుగారికి, టీజర్ విడుదల చేసిన నానిగారికి, ట్రైలర్ విడుదల చేసిన నాగార్జునగారికి థాంక్స్. ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన వరుణ్ తేజ్ గారికి థాంక్స్. ఇవన్నీ మీకు చిన్న విషయాలు అయ్యి ఉండొచ్చు. కానీ, మాకు పెద్ద పెద్ద విషయం. మీలాంటి పెద్దవాళ్లు సపోర్ట్ చేస్తేనే మేం ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చెప్పగలం. నేను ‘గోల్కొండ హై స్కూల్’లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసినప్పటి నుంచి నిమ్మకాయల ప్రసాద్ గారు నాకు పరిచయం. నా పేరును నిహారికగారికి ఆయనే సజస్ట్ చేశారు. ఆడిషన్ చేసి నచ్చితే తీసుకోమని చెప్పారు. ఆ ఒక్క ఆడిషన్ వల్ల నేను చాగా చేస్తున్నాని చాలామంది ఫోనులు చేశారు. ఆయనకు చాలా నేను రుణపడి ఉంటాను. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని అందరూ సినిమా అనుకుంటున్నారు. ఇది వెబ్ సిరీస్ అయినా మేం సినిమాలా చేశాం. నిహారిక గారు కథను ఎంతగానో నమ్మారు. ఒక సినిమాకు ఏమాత్రం తక్కువ కాకుండా నిర్మించారు. ఆవిడ అనుకుంటే పెద్దవాళ్లను తీసుకోవచ్చు. కానీ, నా మీద నమ్మకం పెట్టుకుని తీసుకున్నారు. ఆవిడ నమ్మకాన్ని నిలబెట్టానని అనుకుంటున్నాను. నిహారిక గారికి చాలా రుణపడి ఉంటాను. నేను బాగా నటించానని అనిపిస్తే… డైరెక్టర్ మహేష్, రైటర్ మానస కారణం. నన్ను అంత బాగా వాళ్లు గైడ్ చేశారు. నరేష్ గారు, తులసి గారు, సిమ్రాన్, గెటప్ శీను… అందరితో నటించడం ఎంజాయ్ చేశాను. టెక్నికల్ టీమ్ అందరూ బాగా చేశారు.

సిమ్రాన్ శర్మ మాట్లాడుతూ “ఈ వెబ్ సిరీస్ చేసే క్రమంలో టీమ్ అందరం ఒక చిన్న ఫ్యామిలీ అయిపోయాం.  ఈ ఫ్యామిలీలో నేను ఒక పార్ట్ కావడం సంతోషంగా ఉంది. మా నిర్మాత నిహారికకు థాంక్స్” అని అన్నారు.

డైరెక్టర్ మహేష్ ఉప్పాల మాట్లాడుతూ “మాది ఒక చిన్న ఊరు కొడకండ్ల. అసలు, సినిమాకు సంబంధం లేదు. అటువంటి వాడిని ఇక్కడ నిలబడ్డానంటే ఒకే ఒక్క కారణం నిహారిక గారు. ఆవిడకు థాంక్యూ సో మచ్. నేను అనే కాదు, ఇక్కడ ఉన్న చాలామంది కొత్తవాళ్లు పీకే, మానస ఇంకా చాలామంది టెక్నీషియన్స్ ను ఎంకరేజ్ చేశారు. నిహారిక ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టే నవంబర్ 19న ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పెద్ద పెద్ద సినిమాలకు పని చేసిన వాళ్లను తీసుకున్నారు. నేను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయి. తల్లితండ్రులకు చెప్పకుండా ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల వెంట పడ్డాను. ఇప్పటివరకూ వాళ్లకు నేనేమీ చేయలేదు. ఇప్పుడు వాళ్లు నన్ను స్క్రీన్ లో చూసి హ్యాపీ ఫీలవుతారని అనుకుంటున్నాను. వాళ్లకు థాంక్స్” అని అన్నారు.

రైటర్ మానసా శర్మ మాట్లాడుతూ “నా పేరు మానస. మాది శ్రీకాకుళం. నేను ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే కారణం నిహారిక గారు. ఆవిడ నన్ను ఎంతగానో నమ్మారు.

ఈ కార్యక్రమంలో వీరశంకర్, సినిమాటోగ్రాఫర్ రాజ్ ఎడ్రోల్‌, మ్యూజిక్ డైరెక్టర్ పీకే, నటుడు ‘గెటప్’ శీను, సీనియర్ నటి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.