దిల్లీ: పలు రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా ఇచ్చే ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలు ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం దిల్లీలో మంగళవారం అట్టహాసంగా జరిగింది. 2021 సంవత్సరానికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేడు ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు హాజరయ్యారు.
ప్రముఖ శిల్పి సుదర్శన్ సాహూ, వైద్యరంగంలో సేవలందించిన డాక్టర్ బెల్లె మోనప్ప హెగ్డే, ఆర్కియాలజీ విభాగంలో ప్రొఫెసర్ బీబీ లాల్ పద్మవిభూషణ్ అందుకున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహజన్, యూపీకి చెందిన నృపేంద్ర మిశ్రా పద్మభూషణ్ స్వీకరించారు. ఈ ఏడాది 10 మందికి పద్మభూషణ్ పురస్కారం ప్రకటించగా.. దీంట్లో ముగ్గురు రాజకీయ ప్రముఖులకు మరణానంతరం అవార్డు లభించింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ తరుఫున ఆయన కుమారుడు, అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ తరఫున ఆయన సతీమణి డాలీ గొగోయ్, బిహార్‌కు చెందిన కేంద్ర మాజీ మంత్రి రాంవిలాస్ పాసవాన్ తరఫున ఆయన కుమారుడు చిరాగ్ పాసవాన్ పద్మభూషణ్ అందుకున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురు పద్మశ్రీ అందుకున్నారు. ఏపీ నుంచి రామస్వామి అన్నవరపు (కళారంగం), ప్రకాశ్‌రావు అసవడి (సాహిత్యం, విద్య), నిడుమోలు సుమతి (కళలు), తెలంగాణకు చెందిన కనకరాజు కళా రంగంలో పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. ఈ ఏడాది ఏడుగురికి పద్మవిభూషణ్, 10 మందికి పద్మభూషణ్, 102 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. 2020 సంవత్సరానికి గానూ పద్మ పురస్కారాలను సోమవారం ప్రదానం చేసిన విషయం తెలిసిందే.