ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు: అధికారులకు ప్రభుత్వం ఆదేశం

సింహాచలం దేవస్థానం భూములను ఆలయ రిజిస్టరు నుంచి తొలగించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు అధికారులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. గతంలో సింహాచలం ఆలయ ఈవోగా పని చేసి, ప్రసుత్తం సస్పెన్షన్‌లో ఉన్న దేవాదాయశాఖ అదనపు కమిషనరు కె.రామచంద్ర మోహన్‌, గతంలో విశాఖ జిల్లా సహాయ కమిషనరుగా పని చేసి సస్పెన్షన్‌లో ఉన్న సింహాచలం ఏఈవో ఎన్‌.సుజాతపై కేసులు నమోదు చేయాలంటూ మూడు రోజుల కిందట సింహాచలం ఆలయ ఈవోకు ఆదేశాలు అందాయి.

ఈ భూముల వివరాలను జత చేస్తూ ఒకటి, రెండు రోజుల్లో సింహాచలం ఈవో పోలీసులకు ఫిర్యాదు చేసే వీలుందని చెబుతున్నారు. మరోవైపు మాన్సాస్‌ భూముల వ్యవహారంపైనా విచారణ జరుగుతుండటంతో.. అక్కడా క్రిమినల్‌ కేసు నమోదు చేయాలంటూ మాన్సాస్‌ ఈవోకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే వీలుందని సమాచారం.