పాముతో ఆసుపత్రికి వెళ్లిన యువకుడు.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు.. అసలేమైందంటే.?

గుంటూరు జిల్లాలోని నందివెలుగు గ్రామానికి చెందిన వీరాంజనేయులును త్రాచుపాము కరిచింది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స కోసం బ్రతికున్న త్రాచుపాముతో సహా వచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆసుపత్రి సిబ్బంది ఆశ్చర్యానికి లోనయ్యారు.

వివరాల్లోకి వెళితే..

నందివెలుగుకు చెందిన వీరాంజనేయులు ఓ సిమెంట్ రాళ్ల పరిశ్రమలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. సిమెంట్ బ్రిక్స్‌ను లోడ్ చేసుకునేందుకు ట్రాక్టర్‌తో సహా నందివెలుగు వచ్చాడు. బ్రిక్స్‌ను ట్రాక్టర్లలో లోడు చేసేందుకు తీస్తూ ఉండగా అతడ్ని త్రాచుపాము కాటేసింది. వెంటనే కాటేసిన త్రాచుపామును డబ్బాలో బంధించాడు. తనతో పాటు వైద్యశాలకు తీసుకొచ్చాడు. అక్కడున్న వైద్య సిబ్బంది ఆశ్చర్యానికి గురి కాగా.. ఏ పాము కాటేసిందో వైద్యులు అడుగుతారని అందుకే పామును డబ్బాలో పెట్టుకుని తీసుకువచ్చినట్టు బదులిచ్చాడు.

కాగా, ప్రస్తుతం వీరాంజనేయులు ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. తనకు వైద్యం పూర్తికాగానే పామును జన సంచారం లేని ప్రాంతంలో వదిలేస్తానని వీరాంజనేయులు తెలిపాడు.