రూ.100 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా ‘రాక్షసుడు 2’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం – నిర్మాత కోనేరు సత్యనారాయణ
బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రమేశ్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇదే డైరెక్టర్‌తో కోనేరు సత్యనారాయణ ఇప్పుడు రవితేజ కథానాయకుడిగా ‘ఖిలాడి’ అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే రమేశ్ వర్మ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో, ఓ స్టార్ హీరోతో.. ‘రాక్షసుడు 2’ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో చేయబోతున్నట్లు ప్రకటించారు నిర్మాత కోనేరు సత్యనారాయణ.
‘రాక్షసుడు’ సినిమా విడుదలై రెండేళ్లవుతుంది. ఈ సందర్భంగా నిర్మాత కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘ ‘రాక్షసుడు’ కంటే ‘రాక్షసుడు 2’ చాలా ఎగ్జయిటింగ్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది. అలాగే కమర్షియల్ అంశాలు కూడా ప్రేక్షకులను ఆక్టుటకునేలా ఈ సబ్జెక్ట్‌లో మిక్స్ చేశాం. చాలా థ్రిల్లింగ్ కాన్సెప్ట్. హాలీవుడ్ చిత్రాల రేంజ్‌లో సినిమాను చేయాలనుకుంటున్నాం. మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావాలనుకోవడం లేదు. పాన్ ఇండియా రేంజ్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో లీడ్ రోల్ చేయబోతున్నారు. అది ఎవరు అనే విషయాన్ని సరైన సమయంలో తెలియజేస్తాం. ఈ చిత్రాన్ని రూ.100 కోట్లతో చేయాలనుకుంటున్నాం. అలాగే సినిమా మొత్తం లండన్‌లోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలు తెలియజేస్తాం“ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ‘‘నిజానికి బాలీవుడ్‌లో ‘రాక్షసుడు’ రీమేక్‌ను కూడా నేను చేయాలని అనుకున్నాం. కానీ కోవిడ్ పరిస్థితుల కారణంగా కుదరలేదు. ఈలోపు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌గారు.. పూజా ఫిలింస్ బ్యానర్‌పై రాక్షసుడు రీమేక్ హక్కుల కోసం సంప్రదించారు. మేం ఎలాగూ చేయడం లేదు. ఆయనతే ఈరోల్‌కు చక్కగా సూట్ అవుతారనిపించడంతో ఆయనకు హక్కులను ఇచ్చేశాం. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేసిన దర్శకుడు రమేశ్ వర్మ.. బాలీవుడ్ రీమేక్‌ను తెరకెక్కించబోతున్నారు. అలాగే మా బ్యానర్‌లో ఖిలాడి మరో బ్లాక్ బస్టర్ కావడం ఖాయం. బాలీవుడ్ నుంచి ప్రముఖ హీరోలు ఈ సినిమా రైట్స్ కోసం మమ్మల్ని సంప్రదించారు. త్వరలోనే మేం దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటాం. వీటితో పాటు మా అబ్బాయి హవీశ్‌తో మంచి చిత్రాలను రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాం. హవీశ్ నుంచి బెస్ట్ మూవీస్‌ను రాబోయే రోజుల్లో మీరు చూడొచ్చు. కచ్చితంగా తను ఒక మంచి హీరో అవుతాడని నమ్మకంఉంది’’ అన్నారు.