ఆర్మీ జవాన్ వీరమరణం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాన్ వీర మరణం పొందగా, ముగ్గురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. రాజ్‌పొరా ఏరియాలోని హంజిన్ గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నట్లు శుక్రవారం ఉదయం భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో అక్కడ బలగాలు కూంబింగ్ నిర్వహించగా, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మిలిటెంట్ల కాల్పులను బలగాలు తిప్పికొట్టాయి. ఆ ప్రదేశంలో కూంబింగ్ కొనసాగుతూనే ఉందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. హతమైన ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పేర్కొన్నారు.
నిన్న ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో నిన్న ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. అయితే ఈ ఇద్దరు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారనేది నిర్ధారించలేదు. గత ఆరు నెలల నుంచి జరిగిన ఎదురుకాల్పుల్లో 61 మంది ఉగ్రవాదులు హతమయ్యారు